- సిటీలో ట్రాఫిక్ లేని కంఫర్టబుల్ జర్నీ మెట్రో రైలు
- దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో ప్రాజెక్టు హైదరాబాద్
హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో షాపింగ్ మాల్స్ మొదలయ్యాయి. కరోనా నష్టాల నుంచి కోలుకుంటున్న మెట్రో ప్రయాణికులకు షాపింగ్ ఎక్స్ పీరియన్స్ పెంచే అవకాశం కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలోని 66 స్టేషన్లలో కొన్నింటిలో మాత్రమే కమర్షియల్ స్పేస్ కు డిమాండ్ ఉంది. మిగతా స్టేషన్లలోనూ వ్యాపారాలు జరిగేందుకు అవకాశాలు కల్పిస్తామంటున్నారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఆసక్తి ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరతో వ్యాపారం చేసుకునేందుకు ఛాన్స్ ఇస్తామంటున్నారు.
దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో ప్రాజెక్టు హైదరాబాద్. సిటీలో ట్రాఫిక్ లేని కంఫర్టబుల్ జర్నీ అంటే మెట్రో రైలు మాత్రమే అంటున్నారు జనం. వేగంగా.. సురక్షితంగా.. ప్రశాంతంగా.. ఆహ్లాదకరంగా జర్నీ చేసే అవకాశం ఉన్న మెట్రో రైలుకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. సిటీలో బైకు మీద లేదా బస్సు, కారులో ఎలా వెళ్లినా గంటకుపైగా పట్టే దూరానికి మెట్రో రైలులో కేవలం 20 నిమిషాలు కూడా పట్టడం లేదు. అంతేకాదు ఏసీలో కంఫర్టబుల్ గా.. ఎలాంటి హడావుడి లేకుండా ప్రయాణించే అవకాశం ఉండడం ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. నిత్యం సిటీలో ప్రయాణించే వారే కాదు.. దూర ప్రాంతాల నుంచి సిటీకి వచ్చిన వారు కూడా మెట్రో వైపే మొగ్గుచూపుతున్నారు.
ఈ నేపథ్యంలో కోవిడ్ వల్ల జరిగిన నష్టాన్ని పూరించుకుని లాభాల్లోకి తీసుకెళ్లేందుకు మెట్రో స్టేషన్స్ లో కమర్షియల్ స్పేస్ పెంచేందుకు అధికారులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళా వ్యాపారులతో ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తున్నారు. మెట్రో బజార్ పేరుతో 15 రోజుల పాటు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. షీ టీమ్ చీఫ్ ఐపీఎస్ ఆఫీసర్ స్వాతీ లక్రా ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. మహిళా ఎంటర్ ప్రెన్యూయర్స్ కు చేయూత ఇచ్చేందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలను చేయడం సంతోషంగా ఉందన్నారు స్వాతి లక్రా. మెట్రోలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక క్యూఆర్ కోడ్ ద్వారా చర్యలు చేపడుతున్నామన్నారు.
మెట్రో స్టేషన్లలో ఖాళీ స్థలాల్లో తాత్కాలిక స్టాల్స్: మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
మెట్రో స్టేషన్లలో ఖాళీ స్పేసుల్లో టెంపరరీ స్టాల్స్ ఏర్పాటుకు తక్కువ అద్దెతో వ్యాపారులకు అవకాశం కల్పిస్తున్నారు. చేనేత (హాండ్లూమ్స్), ఫుట్ వేర్, హోం మేడ్ ఫుడ్, జూట్ బ్యాగ్స్, హ్యాండ్ మేడ్ గిఫ్టింగ్ సొల్యూషన్స్, సల్ఫేట్, లాంటి కెమికల్ ఫ్రీ ఉత్పత్తులపై అవగాహనతో పాటు, ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను అందిస్తున్నారు. ప్రస్తుతం వాడుతున్న బ్యూటీ, బాడీ ప్రాడక్టులకు ప్రత్యామ్నాయంగా ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెంచేందుకు మెట్రో స్టేషనల్లో మహిళా వ్యాపారులు స్టాల్స్ పెడుతున్నారు. మెట్రోలో ప్రయాణికులతో పాటు.. కమర్షియల్ స్పేస్ కు డిమాండ్ పెంచేందుకు మెట్రో అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు అనూహ్య స్పందన వస్తోంది. సిటీలో బయట ఎక్కువ అద్దె చెల్లించలేని వారు మెట్రో స్టేషన్లలో స్టాల్స్ ను ఉపయోగించుకుంటున్నారు.