మెట్రో ఫేజ్-2లో ఆరు కారిడార్లు

మెట్రో ఫేజ్-2లో ఆరు కారిడార్లు
  • మొత్తం 116.2 కిలోమీటర్లు.. అంచనా వ్యయం రూ. 32,237 కోట్లు
  • ఫోర్త్ సిటీ మెట్రో మినహా మిగతా ఐదు కారిడార్ల డీపీఆర్​లు సిద్ధం 
  • త్వరలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందించనున్న హెచ్ఎంఆర్ఎల్
  • ఎయిర్​పోర్టు మెట్రో అలైన్​మెంట్​లో మార్పు 
  • మైలార్​దేవ్ పల్లి నుంచి ఆరాంఘర్, కొత్త హైకోర్టు మీదుగా లైన్


హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆరు కారిడార్లతో మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) రూపకల్పన చేసింది. ఈ ఫేజ్ లో మొత్తం 116.2 కిలోమీటర్ల మెట్రోను పూర్తి చేసేందుకు రూ.32,237 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. ఇప్పటికే ఐదు కారిడార్లకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)లను దాదాపు పూర్తి చేసింది. ప్రభుత్వం ప్రతిపాదించిన ఫోర్త్ సిటీ మెట్రోకు సంబంధించిన డీపీఆర్ ను మరో మూడు నెలల్లో సిద్ధం చేయనుంది. ఇప్పటికే డీపీఆర్ లు పూర్తయిన ఐదు కారిడార్లకు సంబంధించి ట్రాఫిక్ అంచనాల విషయంలో కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ)ను హెచ్ఎండీఏ ఇవ్వాల్సి ఉంది. ఆ రిపోర్టు రాగానే డీపీఆర్ లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్ఎంఆర్ఎల్ పంపించనుంది. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ గా చేపట్టాలని ప్రతిపాదించింది.

మెట్రో ఫేజ్–2 ప్రాజెక్టుపై హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్), హైదరాబాద్ ఎయిర్‌‌‌‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆదివారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ ఫేజ్ లోని కారిడార్లు, అలైన్ మెంట్లు, ఇతర వివరాలను వెల్లడించారు. డీపీఆర్ పూర్తయిన వాటిలో నాగోల్-ఎయిర్​పోర్టు, రాయదుర్గం-కోకాపేట నియోపోలీస్, ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట (ఓల్డ్ సిటీ మెట్రో), మియాపూర్-పఠాన్​చెరు, ఎల్బీనగర్-హయత్​నగర్ కారిడార్లు ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తం 76.2 కిలోమీటర్ల మార్గానికి గాను రూ.24,237 కోట్లు ఖర్చవుతుందని హెచ్ఎంఆర్ఎల్ అంచనా వేసింది. ఇక ఆరో కారిడార్ అయిన ఎయిర్ పోర్టు-ఫోర్త్ సిటీ మార్గంలో 40 కిలోమీటర్లకు గాను రూ.8,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. కాగా, మెట్రో మొదటి ఫేజ్ లో మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు రెండో ఫేజ్ పూర్తయితే మొత్తం 9 కారిడార్లలో 185 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి రానుంది. 

ఎయిర్ పోర్టు మెట్రో లైన్ లో మార్పులు.. 

ఎయిర్‌‌‌‌పోర్ట్ మెట్రో అలైన్‌‌‌‌మెంట్ ను ప్రభుత్వం మార్చింది. నాగోల్, ఎల్బీనగర్, చాంద్రాయణ గుట్ట, మైలార్​దేవ్ పల్లి, ఆరాంఘర్, -బెంగళూర్ హైవే, కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్ పోర్టుకు మెట్రో లైన్ ఖరారు చేసింది. కారిడార్- 4లో భాగంగా నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ వరకు 36.6 కిలోమీటర్ల మార్గానికి ఆమోదం తెలిపింది. ఈ కారిడార్‌‌‌‌లో 1.6 కిలోమీటర్ల లైన్ అండర్ గ్రౌండ్​ నుంచి వెళ్లనుంది. ఈ మార్గంలో ఎయిర్ పోర్ట్ స్టేషన్‌‌‌‌ సహా మొత్తం 24 మెట్రో స్టేషన్లు ఉంటాయి. గతంలో పీ7 రోడ్ నుంచి ఎయిర్​పోర్టు మెట్రో అలైన్ మెంట్ ఉండగా, ఇప్పుడు కొత్త హైకోర్టు మీదుగా మార్చారు. కొత్త హైకోర్టు మీదుగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని మెట్రో అధికారుల స్టడీలో తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, మొదటి మూడు కారిడార్లను కలుపుతూ ఎయిర్​పోర్టు అలైన్ మెంట్ వెళ్తుంది. 

ఓల్డ్​ సిటీలో 1,100 ఆస్తులపై ప్రభావం.. 

ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఓల్డ్​సిటీ మెట్రోను నిర్మించనున్నారు. ఈ కారిడార్ లో సాలార్‌‌‌‌జంగ్ మ్యూజియం, చార్మినార్ వద్ద స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ఆ స్టేషన్లకు వాటి పేర్లనే పెట్టనున్నారు. ప్రస్తుతం దారుల్‌‌‌‌షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ మధ్య 60 అడుగుల రోడ్డు, శాలిబండ జంక్షన్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు 80 అడుగుల రోడ్డు ఉందని... వాటిని 100 అడుగులకు విస్తరిస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. స్టేషన్ ఉండే ప్రాంతాల్లో మాత్రం రోడ్డును 120 అడుగులకు విస్తరిస్తామని చెప్పారు. ఈ కారిడార్ లో మెట్రో అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌, రోడ్డు విస్తరణలో దాదాపు 1,100 ఆస్తులపై ప్రభావం పడుతుందని వెల్లడించారు. ఇప్పటికే 400 ఆస్తులకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేశామని పేర్కొన్నారు. కాగా, ఈ మార్గంలో దాదాపు 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయి.  

ఇవీ కారిడార్లు..

కారిడార్ IV : నాగోల్​-ఎయిర్ పోర్టు, 36.6 కిలోమీటర్లు   
స్టేషన్లు 24:
నాగోల్, నాగోల్ క్రాస్ రోడ్, అల్కపురి, కామినేని, ఎల్బీనగర్, బైరామల్ గూడ, మైత్రినగర్, కర్మాన్‌‌‌‌ఘాట్, చంపాపేట్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్డీవో, బాలాపూర్ రోడ్, చాంద్రాయణ్ గుట్ట, బండ్లగూడ, మైలార్‌‌‌‌దేవ్‌‌‌‌పల్లి, కాటేదాన్, ఆరాంఘర్, న్యూ హైకోర్టు,  గగన్ పహాడ్, శతంరాయి, సిద్ధాంతి, శంషాబాద్ జంక్షన్, ఎయిర్​పోర్టు కార్గో, ఎయిర్ పోర్టు.  

కారిడార్ V : రాయదుర్గం – -కోకాపేట నియోపోలిస్, 11.6 కిలోమీటర్లు
స్టేషన్లు 11: రాయదుర్గం, బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, 
నానక్ రామ్ గూడ జంక్షన్, గోల్ఫ్ కోర్స్, విప్రో సర్కిల్, పుప్పాలగూడ, ఓఆర్ఆర్ జంక్షన్, ఖానాపూర్, మూవీ టవర్స్, కోకాపేట నియోపోలీస్. 

కారిడార్ VI:  ఎంజీబీఎస్–చాంద్రాయణ గుట్ట (ఓల్డ్ సిటీ మెట్రో), 7.5 కిలోమీటర్లు
స్టేషన్లు 6:
ఎంజీబీఎస్, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, అలియాబాద్, ఫలక్ నుమా, చాంద్రాయణగుట్ట. 

కారిడార్ VII: మియాపూర్ – పటాన్ చెరు, 13.4 కిలోమీటర్లు 
స్టేషన్లు 10: మియాపూర్​ఎక్స్​రోడ్, ఆల్విన్​ఎక్స్ రోడ్, మదీనాగూడ, చందానగర్, బీహెచ్ఈఎల్, జ్యోతినగర్, బీరంగూడ, ఆర్సీ పురం, ఇక్రిశాట్, పటాన్‌‌‌‌చెరు. 

కారిడార్ VIII: ఎల్బీ నగర్ –- హయత్ నగర్, 7.1 కిలోమీటర్లు 
స్టేషన్లు 6: చింతల్ కుంట, వనస్థలిపురం, ఆటోనగర్, లెక్చరర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, హయత్ నగర్. 

కారిడార్ IX : ఎయిర్ పోర్ట్​– ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ), 40 కిలోమీటర్లు 

3 రకాలుగా ఫోర్త్ సిటీ మెట్రో.. 

ఎయిర్​పోర్టు నుంచి ఫోర్త్ సిటీలోని స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన మెట్రో కారిడార్ ను మూడు రకాలుగా నిర్మించనున్నారు. ఇందులో 1.6 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్​, 20 కిలోమీటర్లు ఎలివేటేడ్ కారిడార్, 18 కిలోమీటర్లు రోడ్​లెవల్ కారిడార్ ఉండనుంది. ఎయిర్ పోర్టు నుంచి పెద్ద గోల్కొండ ఎగ్జిట్, తుక్కుగూడ ఎగ్జిట్, రావిర్యాల ఎగ్జిట్, ఔటర్ రింగ్​రోడ్ మీదుగా హైవేకు, సర్వీస్​రోడ్ కు మధ్యలో మెట్రో లైన్ రానుంది.