- టెక్నికల్ ఇష్యూతో నిలిచిపోయిన రైళ్లు
- మరికొన్ని చోట్ల మెల్లిమెల్లిగా నడిచినయ్
- మెట్రో సేవలకు 15 నిమిషాలు అంతరాయం
- మూడు కారిడార్లలో 55 రైళ్లపై ఎఫెక్ట్
- రైళ్ల ఆలస్యంతో స్టేషన్లలో పెరిగిన రద్దీ
హైదరాబాద్ సిటీ, వెలుగు:మెట్రో రైల్ సేవలకు మళ్లీ అంతరాయం కలిగింది. కొద్ది రోజుల కింద టెక్నికల్ఇష్యూతో రైళ్లు కొద్దిసేపు నిలిచిపోగా, సోమవారం ఉదయం మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో కొన్నిచోట్ల రైళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల మెల్లిమెల్లిగా నడిచాయి. రన్నింగ్రైళ్లు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు.
9 నుంచి 10 గంటల మధ్య..
విద్యుత్ఫీడర్ఛానల్లో తలెత్తిన ఇష్యూతో ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. మొదటగా బేగంపేట– రాయదుర్గం మెట్రో స్టేషన్ల మధ్య ఎలక్ట్రిక్ ఫీడర్లో టెక్నికల్సమస్య తలెత్తింది. దీంతో బ్లూలైన్లోని బేగంపేట, అమీర్పేట మధ్య నడుస్తున్న ట్రైన్మధ్యలోనే ఆగిపోయింది. మూసారంబాగ్మెట్రో స్టేషన్లో మరో మెట్రో రైల్కొద్దిసేపు నిలిచిపోయింది. నాగోల్– -రాయదుర్గం, ఎల్బీనగర్–-మియాపూర్, జేబీఎస్– ఎంజీబీఎస్కారిడార్లలో 55 రైళ్లపై ఈ ఎఫెక్ట్ పడింది.
కొన్ని రైళ్లు స్టేషన్లలో నిలిచిపోగా, మిగతా సర్వీసులు నెమ్మదిగా నడిచాయి. కొన్ని స్టేషన్లలో రైళ్లు ఆగినా డోర్లు ఓపెన్ కాలేదని సమాచారం. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మూసారాంబాగ్తో పాటు ఇతర చోట్ల రైలు ఆగినప్పుడు ‘స్వల్ప ఆలస్యం జరగనున్నది ..అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని మాటిమాటికి రైళ్లలో వాయిస్వినిపించింది. ఎందుకు ఆగిపోయిందో.. ఏమవుతుందో చెప్పేవారు లేక ప్రయాణికులు కంగారు పడ్డారు.
విషయం తెలుసుకున్న మెట్రో అధికారులు సుమారు పావు గంట తర్వాత రీస్టోర్ చేసి రైళ్లు యథావిధిగా నడిచేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు రైళ్ల రాకపోకలు ఆలస్యం కావడంతో మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఈ విషయమై మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి మాట్లాడుతూ ‘సమస్య తలెత్తిందని తెలిసిన వెంటనే రైళ్ల ఫ్రీక్వెన్సీ పునరుద్ధరించాం. ప్రస్తుతం రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి’ అని ప్రకటించారు.
తరచుగా సాంకేతిక సమస్యలు
హైదరాబాద్ మెట్రోలో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. గతంలో కొన్నిసార్లు మెట్రో రైళ్లు పట్టాలపైనే ఆగిపోయాయి. ఆ మధ్య ఓ స్టేషన్లో మెట్రో డోర్లు తెరచుకోక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం కూడా మెట్రో రైల్రెండు స్టేషన్ల మధ్య సుమారు 15 నిమిషాలకు పైగా ఆగిపోయిన ఘటనతో ప్యాసింజర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.