
- పర్మిషన్స్ కోసం 99000 93820 నంబర్ ను సంప్రదించండి
- హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్ సిటీ, వెలుగు: మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలోని కమర్షియల్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కు స్కైవాక్ నిర్మాణాలను ప్రోత్సహిస్తామని హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో లిమిటెడ్(హెచ్ఏఎమ్ఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. మూడు రోజుల కింద హెచ్ఎండీఏ స్వర్ణజయంతి భవన్ లో నిర్వహించిన కాంప్రెహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ పై హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో జరిగిన సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిపారు.
ఇప్పటికే మెట్రో, హెచ్ఎండీఏ నిర్మించిన స్కైవాక్ లు ప్రయాణికులకు, పాదచారులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌లను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు, రెసిడెన్షియల్ కమ్యూనిటీలు, కమర్షియల్ మాల్స్ నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు.
నాగోలు, ఉప్పల్‌స్టేడియం, దుర్గం చెరువు, కూకట్ పల్లి వంటి మెట్రోస్టేషన్ల నుంచి స్కైవాక్ అనుమతుల కోసం చర్చలు జరుగుతున్నాయని, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి ఓ రెసిడెన్షియల్ కమ్యూనిటీ నిర్మాణ సంస్థ స్కైవాక్ నిర్మిస్తున్నదని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్ లు నిర్మించుకోదలిస్తే ఎల్ అండ్ టీ అధికారి కేవీ నాగేంద్ర ప్రసాద్ (99000 93820) ను సంప్రదించాలని సూచించారు. అలాగే ప్రతి మెట్రో స్టేషన్ రోడ్డు క్రాసింగ్ కోసం మెట్రో స్టేషన్లను ఉపయోగిస్తే ఎలాంటి చెల్లింపులు చేయనక్కలేదని, ఎస్కలేటర్లు, లిఫ్టులు, మెట్ల మార్గం గుండా పైకి ఎక్కి రోడ్డు దాటొచ్చని సూచించారు.