ఎక్స్ ట్రా ​బోగీల్లేవ్.. కొత్త రైళ్లే: వచ్చే ఏడాది పరుగులు పెట్టనున్న 10 కొత్త మెట్రో రైళ్లు

  • ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అధికారుల నిర్ణయం 
  • అదనపు బోగీలు తెచ్చేందుకు వీలుకాకపోవడంతో కొత్త రైళ్ల వైపు మొగ్గు

హైదరాబాద్ సిటీ, వెలుగు:హైదరాబాద్ మెట్రో ట్రాక్​పై త్వరలో 10 కొత్త రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో అందుబాటులో ఉన్న రైళ్లు రద్దీగా మారాయి. ముఖ్యంగా పీక్ అవర్స్ లో రైళ్లలో అడుగు అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. గతంలో నాగ్​పుర్, పుణె నుంచి అదనపు కోచ్​లు తెప్పించాలని నిర్ణయించినా వీలుకాలేదు. దీంతో తాజాగా 10 కొత్త రైళ్లు కొనాలని నిర్ణయించినట్లు మెట్రో అధికారులు తెలిపారు.

మెట్రో ఫస్ట్​ఫేజ్​లో 57 రైళ్లను సౌత్ కొరియాలోని హ్యుందాయ్ రోటెం కంపెనీ నుంచి కొనుగోలు చేయగా, ప్రస్తుతం ఆ సంస్థ ఇండియాకు ఎగుమతులు నిలిపివేసింది. దీంతో మన దేశంలోని మూడు కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. అయితే ఒక్కో కోచ్ డిజైనింగ్​కు ఆరు నెలల సమయం పడుతుందని, మెట్రో రైల్ మానుఫ్యాక్చరింగ్, డెలివరీ అవడానికి 18 నెలల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు.

ప్రస్తుతానికి రద్దీ రూట్లలో షార్ట్ లూప్ సర్వీసులు నడుపుతున్నామని తెలిపారు. చాలా మంది ప్రయాణికులు డోర్ల వద్దే నిల్చుంటున్నారని, ప్రయాణికులు క్రమశిక్షణను అలవర్చుకుంటే రద్దీ సమస్య చాలా వరకు తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. 

అద్దెకు ఇచ్చేందుకు నిరాకరణ 

మెట్రో రైళ్లలో రద్దీని తగ్గించేందుకు అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని మెట్రో అధికారులు గతంలో నిర్ణయించారు. నాగ్​పుర్, పుణె మెట్రో సంస్థల నుంచి అద్దె ప్రాతిపదికన బోగీలు తీసుకురావాలని అనుకున్నారు. ప్రకటించి ఏండ్లు గడుస్తున్నా ఇంతవరకు అదనపు బోగీలను తీసుకురాలేదు.

అక్కడి మెట్రోల్లో ప్రయాణికుల రద్దీ రోజురోజుకు పెరుగుతుండడంతో బోగీలను అద్దెకు ఇచ్చేందుకు నిరాకరించారు. అలాగే అద్దెకు తెస్తే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుందని మెట్రో అధికారులు చెబుతున్నారు. అదేదో కొత్త రైళ్లు కొంటే అద్దె భారం ఉండదని, రైళ్లలో రద్దీని తగ్గించవచ్చని అంటున్నారు. 

ప్రజా రవాణాలో 13 శాతం మెట్రోదే..

ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కి.మీ. పరిధిలో 57 రైళ్లు తిరుగుతున్నాయి.  రోజూ 1,050 ట్రిప్పులతో ట్రాక్ పై పరుగులు పెడుతున్నాయి.  రోజూ 5 లక్షల మందికి పైగా మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఒక్కో ట్రెయిన్ కు 3 కోచ్ లు ఉండగా, ఒక్కో కోచ్ లో ట్రిప్పుకు సుమారు 300 మంది జర్నీ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నవాటిలో రోజుకు 7 లక్షల మంది ప్రయాణించే వీలు ఉందని మెట్రో అధికారులు చెబుతున్నారు. 10 కొత్త రైళ్లు వస్తే రోజుకు 10 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.

ప్రస్తుతం పబ్లిక్ ట్రాన్స్​పోర్టులో మెట్రో మాత్రమే 13 శాతం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. ట్రాఫిక్, పొల్యూషన్ సమస్యలతో ఇబ్బంది పడకుండా, టైమ్​కు గమ్యస్థానానికి చేరుకునేందుకు ఎక్కువ మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఆఫీస్, కాలేజీ, స్కూళ్ల సమయంలో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. నాగోలు నుంచి అమీర్​పేట, అమీర్​పేట నుంచి రాయదుర్గం వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. రద్దీని తగ్గించడానికి ఆయా రూట్లలో లూప్ సర్వీసులు నడిపిస్తున్నట్టు మెట్రో అధికారులు తెలిపారు.