హైదరాబాద్ మెట్రో రైళ్ల టైమింగ్స్ మారాయ్.. చివరి ట్రైన్ నైట్ 11 గంటలకు కాదు..!

హైదరాబాద్ మెట్రో రైళ్ల టైమింగ్స్ మారాయ్.. చివరి ట్రైన్ నైట్ 11 గంటలకు కాదు..!

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైళ్ల టైమింగ్స్ మారాయి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నుంచి తప్పించుకునేందుకు నగరవాసులు మెట్రో రైళ్లలోనే ఎక్కువగా జర్నీ చేస్తున్నారు. దీంతో మెట్రో రైళ్లలో రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ కారణంగా పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ఏప్రిల్ 1 నుంచి టెర్మినల్ స్టేషన్‌ల నుంచి చివరి రైలు బయలుదేరే సమయాన్ని హైదరాబాద్ మెట్రో రైలు పొడిగించింది. ప్రస్తుతం టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 11 గంటలకు బయల్దేరుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి 11 గంటల 45 నిమిషాలకు బయల్దేరుతుంది.

ఏప్రిల్ 1 నుంచి రాత్రి11 గంటల 45 నిమిషాలకు టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి రైలు బయల్దేరేలా టైమింగ్స్లో మార్పులుచేర్పులు చేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు చివరి మెట్రో రైలు రాత్రి 11 గంటల 45 నిమిషాలకు, శని, ఆదివారాలు రాత్రి 11 గంటలకు టెర్మినల్ స్టేషన్ నుంచి బయల్దేరుతుంది. అలాగే ఉదయం మెట్రో మొదటి రైలు బయల్దేరే సమయంలో కూడా మార్పులు చేశారు. సోమవారం నుంచి శనివారం వరకూ ఉదయం 6  గంటలకు, ఆదివారం ఒక్కరోజు ఉదయం 7 గంటలకు మెట్రో రైలు సేవలు ప్రారంభమవుతాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 

హైదరాబాద్ మెట్రోను విద్యార్థులు ఎక్కువగా వినియోగించుకుంటున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని 20 ట్రిప్పులకు చెల్లించి 30 ట్రిప్పులను విద్యార్థులు పొందే -ఆఫర్ను మరో సంవత్సరం పాటు మెట్రో పొడిగించింది. ఈ ఆఫర్ మార్చి 31, 2026 వరకు అందుబాటులో ఉంటుంది.  ఏప్రిల్ 2024లో ప్రారంభమైన సూపర్ సేవర్ హాలిడే ఆఫర్ (SSO) మరియు ఆఫ్- పీక్ తగ్గింపు ఆఫర్ 31 మార్చి 2025న ముగుస్తుంది.