లాక్ డౌన్ తో మార్చి 22 న నిలిచిన మెట్రో రైళ్లు..
168 రోజుల తర్వాత తిరిగి సేవలు ప్రారంభం..
ఇవాళ కారిడార్ 1.. మియపూర్ నుంచి ఎల్బీనగర్ మాత్రమే..
ఉదయం 7 నుంచి, మధ్యాహ్నం 12 వరకు.. సాయంత్రం 4 నుంచి 9 వరకు మాత్రమే
ఆన్లైన్, స్మార్ట్ కార్డ్, క్యూ ఆర్ కోడ్లతోనే టికెట్లు
హైదరాబాద్: లాక్‌డౌన్‌తో బ్రేకులు పడిన మెట్రో రైలు సేవలు పునః ప్రారంభమయ్యాయి. మొదటి రైలు ఎల్బీనగర్ నుంచి మియాపూర్‌కి నడిచింది. అన్‌లాక్ 4తో తిరిగి మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. తొలి దశలో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం నాలుగింటి నుంచి రాత్రి 9గంటల వరకు మాత్రమే నడపుతున్నారు. ప్రతి 5 నిమిషాలకు ఒక ట్రైన్ నడుపుతూ.. రద్దీని బట్టి టైమింగ్స్ లో మార్పులు చేయనున్నారు. మెట్రో రైలు పునః ప్రారంభమైన సందర్భంగా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెన్ చేసేందుకు ఒక్కో ట్రైన్లో 300 మందికి.. ఒక కోచ్‌లో 100 మంది చొప్పున అనుమతిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందు ఒక్కో ట్రైన్లో వెయ్యి మందిదాకా జర్నీ చేసేవారు. అయితే ఇవాళ తొలి రోజు కావడంతో కొద్ది సంఖ్యలోనే వచ్చారు.
ట్రైన్ లో కోవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు
తొలి దశలో కొద్దిరోజులపాటు డైలీ 10వేల నుంచి 15వేల మంది ప్రయాణికులు జర్నీ చేసే అవకాశముందని మెట్రో వర్గాల అంచనా. కొవిడ్ రూల్స్‌కి అనుగుణంగా ప్రతి స్టేషన్లో ఐసోలేషన్ రూమ్‌లు ఏర్పాటు చేసి థర్మల్ స్ర్కీనింగ్, శానిటైజర్, ఫిజికల్ డిస్టెన్సింగ్ కోసం మార్కింగ్లు ఏర్పాటు చేశారు. ట్రైన్లో 75శాతం ఫ్రెష్ ఎయిర్ ఉండేందుకు అక్కడక్కడా టెర్మినల్స్ వద్ద ట్రైన్ డోర్లు కొద్దిసేపు తెరిచి ఉంచుతున్నారు. డైలీ స్టేషన్లలో డిస్ ఇన్ఫెక్టివ్ స్ప్రేతోపాటు, రాత్రిళ్లు ట్రైన్లను శానిటైజ్ చేస్తున్నారు. స్టేషన్లు, ట్రైన్స్‌లో శానిటైజర్ అందుబాటులో ఉంటుంది. ఫేస్ మాస్క్ తప్పనిసరి. లేని వారు స్టేషన్లోనే కొనుక్కునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్యాసింజర్స్ టికెట్స్ తీసుకునే టైమ్‌లో ఆన్లైన్, స్మార్ట్ కార్డ్, క్యూ ఆర్ కోడ్‌ని యూజ్ చేసి కొనుగోలు చేసేలా ఏర్పాటు చేశారు. టోకెన్ సిస్టమ్‌ను రద్దు చేశారు. జర్నీ టైమ్‌లో మినిమమ్ బ్యాగేజ్ మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు.