
- నాగోలు - ఎయిర్పోర్ట్ రూట్‌పై ఎక్స్ (ట్విట్టర్) లో మెట్రో ప్రకటన
- ఇదివరకు స్పీడ్ కోసం స్టేషన్ల సంఖ్య తగ్గిస్తామన్న అధికారులు
- అదేమీ లేదని క్లారిటీ ఇచ్చిన మెట్రో
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ లో మెట్రో సెకండ్ ఫేజ్ లో కీలకమైన పర్పుల్ కారిడార్ అయిన నాగోల్–ఎయిర్పోర్ట్ రూట్లో 24 స్టేషన్లు ఉంటాయని మెట్రో అధికారులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. 36.8 కి.మీ దూరం ఉండే కారిడార్ –4 రూట్లో స్టేషన్లను తగ్గించి సగటు స్పీడ్ పెంచే చాన్స్ ఉందని గతంలో అన్నారు. కానీ, బుధవారం స్టేషన్ల సంఖ్య తగ్గించడం లేదని, ముందుగా అనుకున్న 24 స్టేషన్లు ఉంటాయని వెల్లడించారు.
కాగా, మెట్రో సెకండ్ ఫేజ్ పార్ట్ –బీలో ఐదు కారిడార్లలో 76.4 కి.మీ దూరం మెట్రో నిర్మాణం జరగనున్నది. వీటికి సంబంధించిన డీపీఆర్ లు కేంద్రప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. ఈ డీపీఆర్ లకు ఆమోదం తెలిపి, మెట్రోకు నిధులివ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం పీఎం నరేంద్ర మోదీని కోరిన సంగతి తెలిసిందే.
24 స్టేషన్లు ఇవే..
నాగోలు – ఎయిర్ పోర్టు రూట్లో నాగోలు, నాగోలు క్రాస్ రోడ్, అల్కాపురి జంక్షన్, కామినేని హాస్పిటల్, ఎల్బీనగర్ , బైరామల్ గూడ, మైత్రీనగర్, కర్మన్ ఘాట్, చంపాపేట రోడ్, ఓవైసీ హాస్పిటల్, కాంచన్ బాగ్, బాలా పూర్ రోడ్, చాంద్రాయణగుట్ట జంక్షన్, బండ్లగూడ రోడ్, మైలార్ దేవ్ పల్లి, కాటేదాన్, ఆరాంఘర్, న్యూ హైకోర్టు, గగన్ పహాడ్, సాతంరాయి, సిద్దాంతి, శంషాబాద్, కార్గో(ఎయిర్పోర్ట్లోపల), ఎయిర్పోర్ట్ స్టేషన్లు ఉంటాయి..