వేసవిలో నీటి సరఫరాకు 850 వాటర్​ట్యాంకర్లు!

  • అవసరమైతే మరిన్ని పెంచేందుకు వాటర్​బోర్డు నిర్ణయం
  •  ఫిల్లింగ్ స్టేషన్లను సైతం పెంచనున్న బోర్డు  
  •  గత వేసవిలో సమస్య ఏర్పడిన   ప్రాంతాలపై స్పెషల్​ఫోకస్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్​పరిధిలో వచ్చే వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చేసేందుకు మెట్రోవాటర్​ బోర్డు అధికారులు సిద్ధమవుతున్నారు. నీటి సరఫరా తీరు మెరుగుపర్చడంతో పాటు నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకంటున్నారు. ప్రస్తుతం బోర్డు వద్ద 733 ట్యాంకర్లుండగా, వేసవిలో ఈ సంఖ్యను 850 వరకూ పెంచాలని నిర్ణయించారు. సిటీతో పాటు ఓఆర్ఆర్​పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రాంతాలకు సైతం నీటి సరఫరా చేయనున్నారు.

ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి వాటర్​బోర్డు అధికారులతో నిర్వహించిన సమావేశంలో కూడా వేసవిలో నీటి సమస్య రాకుండా ప్లాన్​రూపొందించుకోవాలని సూచించారు. దీనికి అనుగుణంగా బోర్డు ఎండీ అశోక్​రెడ్డి తరచూ ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ నీటి సరఫరా తీరు గురించి తెలుసుకుంటున్నారు. వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

గత వేసవిలో నార్సింగి, కొండాపూర్, హైటెక్​సిటీ, శేరిలింగంపల్లి, కూకట్​పల్లిల్లో దాదాపు వంద కుటుంబాలు 31 వేల ట్రిప్పుల ట్యాంకర్లను బుక్​చేసుకున్నాయని తెలిసి ఆశ్చర్యపోయారు. ఈసారి ఆయా ప్రాంతాల్లో నీటి సమస్య నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు.  ఆ ఏరియాలపై స్పెషల్​ఫోకస్​పెట్టనున్నారు. 

ఫిల్లింగ్​ పాయింట్లను పెంచాలని నిర్ణయం

కొద్ది రోజులుగా గ్రేటర్ పరిధిలో ట్యాంకర్ల బుకింగ్​క్రమ క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు 500 నుంచి 800 ట్యాంకర్లు బుకింగ్​అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఫిల్లింగ్​స్టేషన్ల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం బోర్డు పరిధిలో 70 ఫిల్లింగ్​స్టేషన్లుండగా.. ఎండలు ముదిరే టైంకు మరో 20 స్టేషన్లు పెంచాలని డిసైడ్​అయ్యారు. 

గతేడాది మార్చి ఆఖరు నాటికి రోజు వారీగా ట్యాంకర్​బుకింగ్స్ 4 వేల నుంచి 5 వేల వరకు ఉండగా, ఏప్రిల్​నాటికి 7 వేలకు చేరింది. మే నెలలో రికార్డు స్థాయిలో 9,250 ట్యాంకర్ల వరకు బుకింగ్​చేసుకున్నారు. దీంతో ట్రిప్పులను రాత్రింబవళ్లు కొనసాగించి 2,37,570 ట్యాంకర్ల నీటిని సరఫరా చేశారు. గతేడాది ట్యాంకర్​బుక్​చేసిన వారం వరకు డెలివరీకి టైం తీసుకోగా, ఈసారి బుకింగ్​చేసిన గంటల్లోనే సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.