
- రూ.5,383 కోట్లతో రెండు ప్యాకేజీలుగా పనులు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు చేపట్టనున్న గోదావరి రెండు, మూడో దశ పనులకు మెట్రో వాటర్ బోర్డు టెండర్లు పిలిచింది. ఆసక్తి గల కాంట్రాక్టర్లు, సంస్థలు ఈ నెల 12 నుంచి టెండర్లు దాఖలు చేయవచ్చని నోటిఫికేషన్లో పేర్కొంది. రూ.5,383 కోట్లతో రెండు ప్యాకేజీలుగా చేపట్టనున్న ఈ పనుల ద్వారా 50 కి.మీ. దూరంలో ఉన్న మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలను సిటీకి తరలించనున్నారు. ఇందులో 15 టీఎంసీలను గ్రేటర్ప్రజల తాగునీటి అవసరాలకు, మరో ఐదు టీఎంసీలను ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లో నిల్వచేసి మూసీ ప్రక్షాళనకు వినియోగించనున్నారు.
ప్యాకేజీ–1లో మల్లన్న సాగర్ నుంచి ఘన్‌పూర్‌కు రా వాటర్‌ను తరలించనున్నారు. ప్యాకేజీ –2లో ఘన్‌పూర్‌నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌కు నీటిని తరలిస్తారు. వీటిని రెండేళ్లలో పూర్తిచేసి నగరానికి 300 ఎంజీడీల నీటిని తరలించాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. రెండు ఫేజ్‌లు పూర్తయితే ఓఆర్ఆర్ పరిధిలోని ప్రాంతాలకు కూడా తాగునీటిని అందించడానికి అవకాశం ఉంటుంది.