
- 112 మందికిగానూ ఓటేసిన 88 మంది
- ఎన్నికకు దూరంగా బీఆర్ఎస్.. మొదటి ఓటు వేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ సిటీ, వెలుగు:హైదరాబాద్(పాత ఎంసీహెచ్పరిధి) లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 112 మంది ఓటర్లకుగానూ 88 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. దీంతో 78.57 శాతం పోలింగ్ నమోదైంది. బీఆర్ఎస్ఎన్నికకు దూరంగా ఉండడంతో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్లు ఓటు వేశారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ఎక్స్ అఫీషియో మెంబర్లు, కార్పొరేటర్ల కోసం వేర్వేరుగా 2 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉదయం 9.30 గంటలకు తొలి ఓటు వేశారు.
అనంతరం ఎంపీలు ఈటల రాజేందర్, కె. లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోలింగ్ బూత్ నంబర్–1 లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తర్వాత ఎంఐఎంకు చెందిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ఒవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ఒవైసీ, మాజీద్ హుస్సేన్, కౌసర్ మొహియుద్దీన్, ముంతాజ్ ఖాన్, మిరాజ్ జాఫర్ హుస్సేన్, మహ్మద్ ముబిన్, అహ్మద్ బిలాలా వరుసగా ఓటు వేశారు. అధికార కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రస్తుత లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేశ్ తో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పోలింగ్ బూత్ నెంబర్–2 లో ఓటేశారు. తెలంగాణ జన సమితి పార్టీ అధినేత, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం కల్లా ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓట్లు వేశారు. ఎంఐఎంకు అత్యధికంగా 50 వరకు ఓట్లు ఉండడం, అందరూ ఓటు హక్కు వినియోగించుకోవడంతో మజ్లిస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడనే ప్రచారం జరుగుతున్నది. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో బీజేపీకి చెందిన సభ్యులు నల్ల రిబ్బన్లు ధరించి వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు.జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ సభ్యులు వస్తున్నారంటూ ప్రచారం
బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉంటామని ప్రకటించారు. అయితే, మధ్యాహ్నం రెండున్నర గంటల తర్వాత పలువురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓటర్లు ఓటెయ్యడానికి వస్తున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ, ఒక్కరు కూడా రాలేదు. పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు బ్యాలెట్ బాక్సులను రిసెప్షన్ సెంటర్ కు భారీ బందోబస్తు మధ్య తరలించారు. అక్కడ పరిశీలించిన తర్వాత స్ట్రాంగ్ రూం లో భద్రపరిచారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్ హాల్ లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
ఎంఐఎం గెలుపు లాంఛనమే
జీహెచ్ఎంసీ లోకల్ బాడీ స్థానం పరిధిలో అధికార కాంగ్రెస్‌పార్టీతోపాటు బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీకి చెందిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లున్నారు. వీరిలో అత్యధికంగా 50 మంది ఓటర్లు ఎంఐఎం పార్టీకి చెందిన వారే ఉండగా, వీరంతా రెండు కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ స్థానం పరిధిలో పోలైన ఓట్లలో సగానికి ఒక్క ఓటు ఎక్కువ వస్తే ఆ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. అంటే 88లో 45 ఓట్లు వస్తే మెజారిటీ మార్క్ చేరుకోవచ్చు. అయితే, ఎంఐఎం పార్టీకి సింగిల్ గానే 50 మంది ఓటర్లున్నారు. అలాగే, కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది. ఈ లెక్కన చూస్తే ఎంఐఎం పార్టీ గెలుపు లాంఛనమే అన్నట్టు కనిపిస్తున్నది.
పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది: రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించగా, మధ్యాహ్నం 2 గంటల వరకే 78.57 శాతం ఓట్లు పోల్ అయ్యాయని వివరించారు. సాయంత్రం 4 గంటల వరకు 78.57 శాతం పోలింగ్ నమోదయ్యిందని చెప్పారు. కాగా, ఎన్నికల్లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ ప్రకటించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, బీఆర్ఎస్ పై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ , బీఆర్ఎస్ నాటకాలు బయటపడ్డాయని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్‌రావు అన్నారు.
పోలింగ్ సరళి ఇలా..
మొత్తం ఓటర్లు 112 మంది కాగా, 88 మంది ఓటేశారు. 31 మంది ఎక్స్అఫీషియో మెంబర్లకు 22 మంది, 81 మంది కార్పొరేటర్ల లో 66 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు 37.51 శాతం, మధ్యాహ్నం 12 గంటల వరకు 77.68 శాతం, 2 గంటల వరకు 78.57 శాతం, తర్వాత నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అంతే శాతం పోలింగ్ఉంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక్కరు కూడా ఓటు వేయలేదు.