సార్లూ.. దోమలు కుట్టి సంపుతున్నయ్!

సార్లూ.. దోమలు కుట్టి సంపుతున్నయ్!
  • దోమల నివారణపై పట్టించుకోని బల్దియా
  • ఫాగింగ్.. యాంటీ లార్వా ఆపరేషన్లు లేవు
  • శివారు ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం
  • మూడేండ్లలో రూ. 50 కోట్లు ఖర్చు 
  • ఎంటమాలజీ విభాగంపై  తీవ్ర విమర్శలు

 హైదరాబాద్, వెలుగు : వానాకాలం సీజన్ కావడంతో పడిన వర్షాలతో  నీరు నిలిచిపోయి దోమల బెడద ఎక్కువవుతుంది. దీంతో సిటీలో బల్దియా రెగ్యులర్ గా ఫాగింగ్ చేయడంలేదు. కేవలం వీఐపీలు ఉండే ప్రాంతాలు తప్ప.. మిగతా ప్రాంతాల్లో నామ్ కే వాస్తేగా చేస్తుండగా సమస్య తీవ్రమవుతోంది. కొన్ని ఏరియాల్లోని ప్రజలు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడంలేదు. వెంటనే ఫాగింగ్ కు చర్యలు తీసుకోవడంలేదు. వారానికోసారి అయినా చేయకపోతుండగా మస్కిటో నెట్ తో పాటు బ్యాట్, దోమ తెర, కాయిల్స్ వంటివి మస్ట్ గా వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఏటా జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారీగా డెంగ్యూ కేసులు నమోదవుతుంటాయి. కాగా.. బల్దియా అధికారులు మాత్రం నియంత్రణ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. మూడేండ్లుగా డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తిస్తున్నారు. దోమల బ్రీడింగ్ పాయింట్లపైనా తగు నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ దోమల వ్యాప్తి మాత్రం తగ్గడంలేదు.  గ్రేటర్ సిటీలో 4,850 కాలనీలు ఉండగా.. డెంగ్యూ కేసులు వచ్చిన 24 గంటల్లోపు ఎక్కడైతే కేసు నమోదైందో వెంటనే ఆ ప్రాంతంలో చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారే తప్ప గ్రౌండ్ లెవల్ లో ఆ పరిస్థితులు కనిపించడంలేదు. పాత కూలర్లు, టైర్లలో నీరు చేరడంతో డ్రమ్ములు, కొలాయిల్లో నీరు ఉంచడంతో దోమలు వ్యాప్తి  చెందుతున్నట్లు అధికారులు గుర్తిస్తున్నారు. మొత్తానికి  దోమల బెడద మాత్రం తగ్గడంలేదు. మూడేండ్లుగా దోమల నివారణకు జీహెచ్ఎంసీ రూ.50 కోట్లకుపైగా  ఖర్చు చేసింది.

ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా.. 

  సిటీలోని బస్తీలు, కాలనీలు ఇలా అన్ని ప్రాంతాల్లోనూ దోమల సమస్య ఎక్కువవుతోంది. మూసీనది పరివాహక ప్రాంతాల్లో సాయంత్రం అయిందంటే బయట తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది. డెంగ్యూ కేసులు నమోదవుతుండగా స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఈనెలలో సిటీ పరిధిలోని జిల్లాల్లో డెంగ్యూ కేసులు200 కుపైగా నమోదయ్యాయి. అధికంగా హాస్టల్స్, స్కూల్స్ ఉన్న ప్రాంతాల్లో దోమలు వ్యాప్తి ఎక్కువగా ఉంది.  బల్దియా ఎంటమాలజీ విభాగంలో 2,300 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరు రెగ్యులర్ గా ఫాగింగ్, యాంటి లార్వా ఆపరేషన్ వంటివి చేపట్టాలి. ఇందుకు డివిజన్ కు రెండు చిన్న మెషీన్లు ,  45 లీటర్ల 2 పెద్ద మెషీన్లు ఉన్నాయి.  కనీసం వారానికి ఒకసారి మస్ట్ గా ఫాగింగ్ చేయాల్సి ఉంది. చెరువులు, కుంటలు, మూసీ పరివాహక ప్రాంతాల్లో వారానికి రెండు సార్లు చేయాల్సి ఉంది.  ఇందుకు ఒక్కొక్కరికి 100 నుంచి 150 ఇండ్లను కేటాయిస్తారు. వీరితో ఉన్నతాధికారులు సక్రమంగా పని చేయించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. 
 
అలర్ట్ గా ఉండాలని సీఎం ఆదేశించినా..

 సిటీ శివారులోని బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌‌‌‌నగర్, నిజాంపేట్‌‌‌‌, బడంగ్‌‌‌‌పేట, బండ్లగూడ జాగీర్‌‌‌‌, మీర్‌‌‌‌పేట కార్పొరేషన్లతో పాటు 23 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని కొన్ని కాలనీల్లో నెలకోసారి కూడా ఫాగింగ్ చేయడంలేదు. దోమల కారణంగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో డెంగ్యూపై ప్రజలకు కనీస అవగాహన కల్పించేవారు లేరు. సీజనల్ వ్యాధులపై అలర్ట్ గా ఉండాలని, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినా అధికారులు మాత్రం అలసత్వాన్ని వీడటంలేదు. డెంగ్యూతో ప్లేట్ లెట్స్ తగ్గి చిన్నారులు ఆస్పత్రుల పాలవుతున్నారు. చాలామంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో ట్రీట్​మెంట్ తీసుకుంటుండగా, నిలోఫర్ హాస్పిటల్ కు కూడా వస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే  వచ్చేనెలలో పరిస్థితి మరింత తీవ్రం అయ్యే అవకాశముంది.

సరిగా ఫాగింగ్ చేయట్లేదు 

 మా ఏరియాలో నెలలో రెండు సార్లు కూడా ఫాగింగ్ చేయడంలేదు. వర్షాలతో దోమలు ఎక్కువయ్యాయి. దోమలపైనా అసలే పట్టించుకోవడంలేదు. ఉదయం, సాయంత్రం అని తేడా లేకుండా పోతుంది. నిత్యం ఫాగింగ్ చేస్తే దోమల సమస్య తగ్గుతుంది. 

 – శ్రీకాంత్, హౌసింగ్ బోర్డు కాలనీ, మౌలాలి

 నిద్రపోలేకపోతున్నం.. 

దోమల బెడద ఎక్కువైంది. రెండు, మూడురోజుల నుంచి మరింత పెరిగాయి. దోమల నివారణకు ఫాగింగ్,  యాంటీలార్వా ఆపరేషన్ అసలు చేయడంలేదు. అధికారులు పట్టించు కోకపోవడంతో ఇబ్బంది పడుతున్నం. రాత్రి పూట నిద్రపోలేకపోతున్నం. 

– నాగరాజు, టెలిఫోన్ కాలనీ,కొత్తపేట్