మూసీ జీవ నదియా.. మురికి కూపమా?

మూసీ జీవ నదియా.. మురికి కూపమా?

హైదరాబాద్ నగరం గుండా ప్రవహించే మూసీ నది అనేక ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురి అవుతున్నది. పాలకులకు, ప్రజలకు పట్టడంలేదు. పట్టణాలకు నది ఒక వరంగా భావిస్తారు. మూసీ నది ఉండడం హైదరాబాద్ నగరానికి కూడా ఒక వరం. ఒకప్పుడు మంచి నీటిని అందించి, పర్యావరణ అవసరాలకు నీరు అందించిన ఈ నది..ప్రస్తుతం నగర మురికినీటికి, పారిశ్రామిక వ్యర్థ జలాలకు, ఘన వ్యర్థాలకు అంతిమస్థానంగా మారిపోయింది.  అక్రమార్కులకు కూడా ఒక వరంగా మారింది. ఇండ్లకు, వాణిజ్య స్థలాలకు, రోడ్లకు కూడా నిరంతరం ‘భూమి’ ఇస్తున్నది ఈ నది. వేడెక్కుతున్న వాతావరణం  నుంచి ఉపశమనం కలిగించే శక్తి ఆ నదికి ఉన్నది. ‘అభివృద్ధి’ సృష్టించిన సమస్యలకు అవసరమైన భూమిని ఇచ్చే దాతగా మూసీ పరిణమించింది. సుందరీకరణ పేరిట కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే రాష్ట్ర ప్రభుత్వం సుస్థిర పరిష్కారాలు వెతకడానికి కూడా ఇష్టపడడం లేదు. ఆధునిక అభివృద్ధికి తార్కాణంగా మారింది మూసీ నది పరిస్థితి. 

తెలంగాణలో పుట్టిన ఏకైక నది మూసీ నది. దాదాపు 267 కిలోమీటర్లు ప్రవహించి వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. యాదృచ్ఛికమో కాదో గాని అది రాష్ట్ర సరిహద్దు. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం దీనిని చిహ్నంగా వాడుకోవాలే. పైగా నిర్లక్ష్యం చేశారు. అనంతగిరి కొండలలో పుట్టే ఈ నదికి 1908లో వచ్చిన వరద వల్ల హైదరాబాద్ నగరం అతలాకుతలం అయ్యింది. తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వచ్చింది. నిజాం ప్రభుత్వం వరద నివారణకు శాశ్వత నిర్మాణాలు చేపట్టింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, జంట జలాశయాలను, ఈసా, మూసా ఉపనదుల మీద కట్టి, అప్పటి నగర పరిధిలో ఎత్తయిన గోడలు కట్టి వరద నివారణ చర్యలు చేపట్టారు. వరద నివారణ నిర్మాణాలు నది ప్రవాహ లక్షణాలను బట్టి నిర్మించారు. అనేక చోట్ల 25 కత్వాలు కట్టి వర్షాకాలపు వరద నీటిని సమీప గ్రామ చెరువుల్లోకి పంపి నీటి నిలువ సామర్థ్యం పెంచారు. ఈ నిర్మాణాల ద్వారా ప్రకృతి అందించే నీటిని సద్వినియోగంలోకి తీసుకొచ్చారు.

ప్రమాదంలో మూసీ పరీవాహక ప్రాంతం

మూసీ నది పరీవాహక ప్రాంతం 11,212 చదరపు కిలోమీటర్లు మొత్తం ప్రమాదంలో పడింది. ఈ నది పరీవాహక ప్రాంతంలో దాదాపు 2.5 కోట్ల జనాభా నివసిస్తున్నారు. ఈ సంఖ్య  ప్రతి ఏటా పెరుగుతున్నది. హైదరాబాద్ పెరుగుదల 95 శాతం ఈ నది పరీవాహక ప్రాంతంలోనే ఉంటున్నది.  గుట్టలను చదును చేస్తున్నారు. వాగులను ఆక్రమిస్తున్నారు. వర్షం నీరు ప్రవహించే మార్గాలు మారిపోతున్నాయి. చెట్లను నరకడం వల్ల వర్షం పడినప్పుడల్లా మట్టి కోతకు గురి అవుతోంది. సారవంతమైన మట్టిని కోల్పోతున్నాం. మూసీ నదిలోకి రోజూ దాదాపు 1,800 మిలియన్ లీటర్ల గృహ, పారిశ్రామిక వ్యర్థ జలాలు కలుస్తున్నాయి. ఏండ్ల కొద్దీ నాలాల ద్వారా చెరువుల్లోకి,  చెరువుల నుంచి నాలాల ద్వారా నదిలోకి ఇవి ప్రవహిస్తున్నాయి.  నేడు హైదరాబాద్ నగరంలో, చుట్టూ ఉన్న నీటి వనరులన్నీ కలుషితమే. మూసీ నదిలో ప్రవహించే మురికినీటి వల్ల గాలి కూడా కలుషితం అవుతున్నది.

రెవెన్యూ భూమిగా మూసీ నది

మూసీ నదిని ఒక నీటి వనరుగా, ప్రకృతిలో భాగంగా చూసే బదులు దానిని ఒక రెవెన్యూ భూమిగా పరిగణిస్తున్నారు. నగరంలో ఉన్న ట్రాఫిక్, మురికి నీరు, చెత్త నిర్వహణ, తదితర సుదీర్ఘ, నిరంతర సమస్యలకు పరిష్కారంగా మూసీ నది ఉందని ప్రభుత్వం భావించడం శోచనీయం. ప్రభుత్వ వైఖరి చూసి ప్రైవేటు వ్యక్తులు ధైర్యంగా కబ్జా చేస్తున్నారు. కోట్లు గడిస్తున్నారు. మూసీ నది సంగమం (మూస, ఈసా నది పాయలు కలిచే చోట), గండిపేట రిజర్వాయర్ దిగువ ప్రాంతం, ఉస్మానియా హాస్పిటల్,  చాదర్​ ఘాట్, అఫ్జల్ గంజ్, అంబర్​పేట్, మూసారాంబాగ్ నుంచి నాగోల్ వరకు ఆక్రమణలు స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వం నుంచి చర్యలు లేవు. గత 25 ఏండ్ల నుంచి మూసీ నది ఆక్రమణలు, కాలుష్యం పట్టించుకోకుండా మునిసిపల్ కార్పొరేషన్, గత ప్రభుత్వాలు మూసీ నది సుందరీకరణ పేరిట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1999లో ప్రతిపాదించిన నందనవనం ప్రాజెక్టు నుంచి ఇటీవల వరకు మూసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘సుందరీకరణ’ పనులు నదిని నాశనం చేసినాయి. 

మూసీలో స్కైవే ప్రాజెక్ట్ 

గత ప్రభుత్వం మూసీ నదిలో స్కైవే ప్రాజెక్ట్ తలపెట్టింది. అంటే నాగోల్ నుంచి నార్సింగి వరకు మూసీ నదిలో రోడ్డు వేస్తే నగర ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని అధికారులు, పాలకులు భావిస్తున్నారు.  ఈ బృహత్తర స్కైవే ప్రాజెక్ట్ పూర్తి అయ్యే సమయానికి విజయవాడ నుంచి వచ్చే ట్రాఫిక్ పదింతలు పెరుగుతుంది. నగర వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్ సమస్య ఇంకా సంక్లిష్టం అవుతుంది. అప్పుడు నది ఉన్నా లేకున్నా ట్రాఫిక్ సమస్య అలానే ఉంటుంది. ఆక్రమణలు జోరు పెరిగి నది పిల్ల కాలువ అయిపోతుంది. 

మూసీ అథారిటీ ఏర్పాటు చేయాలి

మూసీ నదిలో మెట్రో స్టేషన్ కట్టిన హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు నది సంరక్షణ చట్టం 1884ని ఉల్లంఘించారు. మెట్రో పిల్లర్లు  కట్టే సమయంలో లారీలు తిరగడానికి వేసిన మట్టి రోడ్డు అలాగే వదిలివేయడంతో అక్రమార్కులకు అది ఒక వరంగా మారింది. ట్రాఫిక్ సమస్య పరిష్కారం పేరిట మూసీ నది మీద 15 బ్రిడ్జిలు కట్టడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే గత ప్రభుత్వం అనేక పనికిరాని ప్రాజెక్టుల కోసం భారీ పెట్టుబడులు పెట్టి ఫలితాలు లేని అప్పుల భారం మిగిల్చింది.  మూసీ నది సుస్థిరత, మహా నగర అభివృద్ధి కోసం నిర్దేశించిన చట్టాలు, నిబంధనలు, ప్రణాళికల మధ్య దగ్గరి సంబంధం ఉన్నది. ఈ సంబంధం విస్మరిస్తే భవిష్యత్తు అంధకారం అవుతుంది.  తెలంగాణ ప్రభుత్వం ఒక మూసీ నది అథారిటీని ఏర్పాటు చెయ్యాలి. మొత్తం నది పరీవాహక ప్రాంతంలో భూమి వినియోగం, భూ వినియోగ మార్పులు, నీటి వనరుల సంరక్షణ, ప్రకృతి సంరక్షణ తదితర అంశాలు అన్ని ఈ అథారిటీ పరిధిలోకి తీసుకు రావాలి. ఈ విషయంపై కొత్త ప్రభుత్వం సీరియస్​గా దృష్టి పెట్టాలి. ప్రభుత్వ చర్యలే మూసీ నదిని నదిలా కాపాడగలుగుతాయి.

ఆక్రమణలతో వరద ముప్పు

2000 సంవత్సరంలో వచ్చిన వరద ఆందోళన కలిగించింది. అనేక నివాస ప్రాంతాలు మునిగిపోయాయి. తరువాత అక్టోబర్ 2020న  వచ్చిన వరద కూడా తీవ్రమైన వర్షపాతం వల్ల వచ్చింది. అనేకసార్లు నది హద్దులు దాటి ఆందోళన కలిగించింది. మూసీ నదికి వరద రాదు అని భావిస్తుంటారు. కానీ, వాతావరణ మార్పుల నేపథ్యంలో గత మూడు ఏండ్లలో నీటి ప్రవాహం ఎక్కువ అయ్యింది. ఈ మధ్య కురుస్తున్న కుండపోత వానల వల్ల వరదలు ఎప్పుడైనా పునరావృతం కావచ్చు. నది ప్రవాహ ప్రాంతం ఆక్రమణలతో వరద ముప్పు అనేక ప్రాంతాలకు విస్తరించవచ్చు.   గత 30 ఎండ్లలో నగరం మారిపోయింది. పట్టణీకరణ విస్తృతం అయినకొద్దీ మూసీ నది నీటి పరీవాహక ప్రాంతం విధ్వంసం పెరుగుతూనే ఉన్నది. 1990లో నగరం మధ్య నది ఆక్రమణలు మొదలుకాగా అవి క్రమంగా పైకి ఎగబాకి ఇప్పుడు అనంతగిరి కొండలకు చేరింది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మూసీ నది ఆక్రమణ వేగం పుంజుకున్నది. బహుళ అంతస్తుల నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా విస్తృతం అయ్యాయి.

వ్యవసాయానికి మురికినీరు

దాదాపు 267 కిలోమీటర్ల నది పొడవులో మొదటి 140 కి.మీ. మురికి నీరే. హైదరాబాద్ దాటితే ప్రమాదకరమైన ఈ నీటినే వ్యవసాయానికి వాడే పరిస్థితి వచ్చింది. ప్రతిరోజు మంజీరా నది, గోదావరి, కృష్ణ (ఇతర ప్రాంతాల నీరు) నుంచి నీటిని తెచ్చుకుని హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామని మురిసిపోతున్నాం. ఒక్క రోజు ఆ నీరు ఆగితే గుండెలు బాదుకునే పరిస్థితి ఉన్నది. మూసీ నది ద్వారా ‘మంచి’ నీటిని పొందటానికి ప్రభుత్వం ఏనాడూ ఆలోచించలేదు. ఆ దిశగా ప్రాజెక్టులు లేవు. వ్యూహాలు లేవు. ఆలోచనలు లేవు. నిధులు అసలే లేవు. దుకాణాలకు, అపార్ట్​మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్సులు, రోడ్లు, బ్రిడ్జిలు, మెట్రో రైలుకు, వినోదానికి, ట్రాఫిక్ వగైరా సమస్యలకు మూసీ నదియే గుర్తుకు వస్తుంది. ఆ సమస్యల మీద సుడులు తిరుగుతున్న ఆలోచనలకు ప్రభుత్వం పెడుతున్న అందమైన పేరు ‘సుందరీకరణ’.  పైగా, మంజీరా నది ప్రాంత వ్యర్థ జలాలను మూసీలో కలిపి శుద్ధి చేస్తున్నామని గర్వంగా ప్రకటించుకునే దశకు చేరుకున్నాం. పారిశ్రామిక వ్యర్థ జలాలు ట్యాంకర్ల ద్వార క్రమంగా మూసీలోకి చేరతాయి. దీని నివారించడానికి ఒక్క ప్రయత్నమూ లేదు. 

- డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్​