రూ.1.60 కోట్ల ఎండీఎంఏ పట్టివేత..నైజీరియాకు చెందిన నిందితుడి అరెస్ట్​

రూ.1.60 కోట్ల ఎండీఎంఏ పట్టివేత..నైజీరియాకు చెందిన నిందితుడి అరెస్ట్​
  • 1,300 గ్రాముల ‘మాల్’​ పట్టివేత

హైదరాబాద్ సిటీ, వెలుగు: డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్​ను హైదరాబాద్ నార్కోటిక్స్, ఎన్​ఫోర్స్​మెంట్​వింగ్, లంగర్ హౌస్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.1.60 కోట్ల విలువైన 1,300 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియాకు చెందిన ఒలీవర్ అలియాస్​ జాన్సన్​2009లో బిజినెస్ వీసాపై న్యూఢిల్లీకి వచ్చాడు. క్లాత్స్, కాస్మోటిక్స్​బిజినెస్ ​చేసేవాడు. వచ్చే సంపాదన సరిపోకపోవడంతో ఏం చేయాలా అని ఆలోచించాడు.

తోటి నైజీరియన్స్​డ్రగ్స్​దందా చేస్తూ లగ్జరీ లైఫ్​ అనుభవిస్తుండడాన్ని చూసి అతడు కూడా బిజినెస్​లోకి దిగాడు. 2013లో పాస్​పోర్ట్​గడువు ముగిసింది. అయినా దేశం విడిచి వెళ్లలేదు. 2013లో హెరాయిన్​తో ఢిల్లీ పోలీసులకు చిక్కి ఆరేండ్లు జైలులో గడిపాడు. బయటకు వచ్చాక ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చి మళ్లీ డ్రగ్స్​అమ్మడం మొదలుపెట్టాడు. తర్వాత బెంగళూరుకు డ్రగ్స్​ దందాను విస్తరించాడు.

నైజీరియాకు చెందిన ఒయీబో దగ్గర గ్రాముకు రూ.300 చొప్పున కిలో, రెండు కిలోలు డ్రగ్స్​కొని ముంబై, హైదరాబాద్, బెంగళూరులో రూ.600 నుంచి వెయ్యి వరకు అమ్ముతున్నాడు. కొద్ది రోజుల కింద ఒయీబో 1,300 గ్రాముల ఎండీఎంఏ ఇచ్చి హైదరాబాద్​లో అమ్మాలని పంపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు లంగర్​హౌస్​లో పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్​విలువ రూ.1.60 కోట్లు ఉంటుందని తెలిపారు..