- వచ్చే నాలుగేండ్లలో లక్షన్నర కోట్లతో అభివృద్ధి చేస్తం: సీఎం రేవంత్
- 40 వేల నుంచి 50 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం
- గోదావరి నీళ్లతో మూసీ పునరుజ్జీవం
- మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్కు రూ.35 వేల కోట్ల చొప్పున నిధులు
- సిటీ అభివృద్ధిపై కేబినెట్ సబ్ కమిటీ
- ప్రతిపక్షాలు, మేధావుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటం
- బీఆర్ఎస్, బీజేపీ పాలసీ డాక్యుమెంట్లు ఇవ్వాలని సూచన
- అభివృద్ధిని అడ్డుకునేటోళ్లకు ఎట్ల బుద్ధిచెప్పాలో తెలుసని కామెంట్
హైదరాబాద్, వెలుగు: వచ్చే నాలుగేండ్లలో హైదరాబాద్‌ను రూ.లక్షన్నర కోట్లతో అభివృద్ధి చేసి.. న్యూయార్క్, టోక్యో నగరాల సరసన నిలుపుతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ‘‘40 వేల నుంచి 50 వేల ఎకరాల్లో అంతర్జాతీయ నగరాలకు దీటుగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం. నగరానికి మణిహారంగా రూ.35 వేల కోట్లతో ట్రిపుల్ ఆర్, అక్కడి నుంచి సిటీని కనెక్ట్చేసేందుకు రూ.15 వేల కోట్లతో రేడియల్ రోడ్లు, ఇంకో రూ.35 వేల కోట్లతో మెట్రో విస్తరణ, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం.
గోదావరి జలాలను మూసీలో పారించి కాలుష్యరహిత నగరంగా, అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంలా మారుస్తాం’’ అని వెల్లడించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘హైదరాబాద్ రైజింగ్’ సభలో సీఎం మాట్లాడారు. నగర అభివృద్ధికి ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ముందు బీజేపీ, తర్వాత బీఆర్ఎస్, మేధావులు తమ సలహాలు, సూచనలు ఇవ్వాలి. రాష్ట్ర, హైదరాబాద్ అభివృద్ధికి తమ వద్ద ఉన్న ప్రణాళికలు, కార్యాచరణ డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరుతున్నాం.
అవి సహేతుకంగా ఉంటే ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా అమలు చేస్తాం. అలా కాకుండా మాపై కోపంతో హైదరాబాద్, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే మాత్రం వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు’’ అని సీఎం రేవంత్ హెచ్చరించారు.భవిష్యత్తరాలకు ఒక అద్భుతమైన నగరాన్ని అందించాలనే లక్ష్యంతోనే ఫ్యూచర్‌సిటీ నిర్మాణం తలపెట్టామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ఒకనాడు ఇన్నర్ రింగ్‌రోడ్డు వేసినం.. తర్వాత ఔటర్ రింగ్‌రోడ్డు వేసినం.. ఇప్పుడు ఈ సరిహద్దులు దాటి రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే రూ.35వేల కోట్లు ఖర్చు పెట్టి 360 కిలోమీటర్లతో తెలంగాణకు మణిహారంగా ట్రిపుల్ ఆర్ నిర్మిస్తున్నాం. ఇందుకు కావాల్సిన ఫండ్స్కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నాం.
ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు రేడియల్ రోడ్లు వేసి 60 శాతం తెలంగాణను అభివృద్ధి పథంవైపు నడిపించే దిశగా ముందుకుపోతున్నాం. జనాలకు ఆర్గానిక్ ఫుడ్ అందించేందుకు అధునాతమైన వ్యవ సాయ విధానాలను తీసుకురావాలని భావిస్తున్నాం.
ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం దగ్గర అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటర్నేషనల్ ఫ్రూట్, వెజిటేబుల్, డెయిరీ ప్రొడక్ట్స్, మీట్ప్రొడక్ట్స్ సేల్చేసేలా కోల్డ్స్టోరేజ్వసతులతో మార్కెట్తీసుకురాబోతున్నాం’’ అని వెల్లడించారు. అలాగే భవిష్యత్తరాల కోసం ముచ్చర్ల ప్రాంతంలో 40 వేల నుంచి 50వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని, 30 వేల ఎకరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నందున మరో15 వేల ఎకరాలు రైతులు సహకరించి అందిస్తే న్యూయార్క్, టోక్యో, సింగపూర్‌లాంటి నగరాలతో పోటీ పడేలా హైదరాబాద్‌ను నిర్మించుకుందామని చెప్పారు.
కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో వరదల నివారణకు రోడ్ల మధ్యలోనే వాటర్హార్వెస్టింగ్వెల్స్కడుతున్నామని, ఒక్కో దగ్గర 10 లక్షల లీటర్లను ఒడిసిపడ్తామన్నారు. ఇప్పటికే కొన్నింటిని ప్రారంభించుకున్నామని, భవిష్యత్‌లో మరో141 ప్రాంతాల్లో కట్టబోతున్నామని తెలిపారు.
నగరాన్ని క్రమపద్ధతిలో అభివృద్ధి చేయాలి. ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్‌కు తీసుకురావాలి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ను ప్రక్షాళన చేసి మూసీని పునరుజ్జీవింపజేయాలి.
ఇందుకు రూ.7 వేల కోట్లు అవుతాయి. ట్రిపుల్ ఆర్కు రూ.35 వేల కోట్లు, రేడియల్రోడ్లకు రూ.15 వేల కోట్లు, మెట్రోకు రూ.35 వేల కోట్లు అవుతాయి’’ అని వివరించారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌పాలనలో హైదరాబాద్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఇప్పటికైనా కండ్లు తెరవకపోతే హైదరాబాద్త్వరలోనే ఢిల్లీ మాదిరి కలుషిత నగరం అవుతుందని హెచ్చరించారు. ముంబై, బెంగళూర్, కోల్ కతా సిటీల మాదిరి వరదలతో అతలాకుతలమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రియల్ఎస్టేట్ దెబ్బతిన్నదని విష ప్రచారం..
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని సోషల్‌మీడియాలో విష ప్రచారం చేయిస్తున్నారని, కానీ ఇది ఎంతమాత్రం నిజం కాదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘‘తెలంగాణ సమాజానికి ఒక విషయం చెప్పదలుచుకున్న.. ఏప్రిల్1, 2023 నుంచి నవంబర్2023 వరకు 8 నెలలతో పోల్చినప్పుడు తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏప్రిల్1, 2024 నుంచి నవంబర్వరకు హైదరాబాద్నగరంలో రియల్ఎస్టేట్ఆదాయం దాదాపు 29 శాతం పెరిగింది. ఇది మా నిబద్ధతకు నిదర్శనం” అని తెలిపారు. హైడ్రా తెచ్చి చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమణల చెర నుంచి విడిపిస్తున్నామని.. దీనికి కొందరు అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. హైడ్రా ఆక్రమణదారుల పనిపడుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల జోలికి వెళ్లదని స్పష్టం చేశారు.
ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ అయ్యిందా?
హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి కేసీఆర్ ఎన్నో హామీలిచ్చి, అవన్నీ మరిచారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘‘ఆనాడు ఒకాయన చెప్పిండు.. ట్యాంక్‌బండ్ నీళ్లు కొబ్బరి నీళ్లలా చేస్తం.. ఇట్ల ముంచుకుని అట్ల తాగొచ్చు అన్నడు. తాగుడు సంగతి దేవుడెరుగు.. వాసన చూసే పరిస్థితి ఉందా? పదేండ్ల పాలనలో ట్యాంక్ బండ్‌ను మురికి కూపంగా మార్చిన చరిత్ర ఆయనది. ఇక ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్చేస్త అన్నడు. ఇస్తాంబుల్కాదు కదా అక్కడున్న ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరించలేదు. చార్మినార్చుట్టూ తిరగలేని పరిస్థితి ఉన్నది. వర్షం వస్తే వరద నీళ్లు హైదరాబాద్ రోడ్ల మీద వదరలా పారుతున్నాయి. కనీసం మురికి కాలువలు కూడా నాటి సీఎం, మున్సిపల్‌శాఖ మంత్రి నిర్మించలేదు.
శిల్పారామం, ట్యాంక్బండ్దగ్గర సెల్ఫీలు దిగి సెల్ఫ్డబ్బాలు కొట్టుకున్నరు. శిల్పారామం కూడా ఆనాడు మా పార్టీనే అభివృద్ధి చేసింది. వాళ్లు మర్చిపోయినట్టున్నరు. వాళ్లు అప్పుడప్పుడు ట్విట్టర్లో పెట్టే హైటెక్ సిటీ కూడా మేం నిర్మించిందే. ట్యాంక్బండ్ఏదో ఆయననే నిర్మించినట్టు.. వాళ్ల తాత బుద్ధుడి విగ్రహం పెట్టినట్టు అబద్ధాలు చెప్పుకుంటున్నరు. పదేండ్లలో రూ.20 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా.. ఈ నగరానికి కావాల్సిన శాశ్వతమైన అభివృద్ధిని గత పదేండ్లలో చేయలేదు” అని బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.
అభివృద్ధి పనులు ప్రారంభం..
సభకు ముందు పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో హెచ్‌సీఐటీఐ ఫేజ్-1లో రూ.3,446 కోట్ల పనులు, రూ.150 కోట్లతో రహదారులు, జంక్షన్ల సుందరీకరణ పనులు, రూ.17 కోట్లతో వరద నియంత్రణ పనులను ప్రారంభించారు. జలమండలి ఆధ్వర్యంలో రూ.669 కోట్లతో నిర్మించిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, తాగునీటి సరఫరాకు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వివిధ ప్రాంతాల్లో రూ.45 కోట్లతో చేపట్టిన 19 రిజర్వాయర్లు, హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గ్రేటర్ సిటీలో రూ.1,500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే పనులను ప్రారంభించారు.
మేల్కోకపోతే మనకూ ఢిల్లీ పరిస్థితే..
ఇప్పటికైనా మేల్కోకపోతే ఢిల్లీ లాంటి పరిస్థితే హైదరాబాద్ కు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయింది. ప్రజలను ఇండ్ల నుంచి బయటకు రావొద్దు అంటున్నారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చిన్రు. ఢిల్లీ నివసించడానికి ఉపయోగపడే నగరంగా లేదు. అక్కడోళ్లను ఇతర ప్రాంతాలకు వలస పొమ్మంటున్నరు. ఇక ముంబై కూడా వర్షం వస్తే అతలాకుతలం అవుతున్నది. అక్కడ కూడా నివసించలేని పరిస్థితి నెలకొంది.
మొన్న వర్షాలు వచ్చి చెన్నై కూడా మునిగిపోయింది. బెంగళూరు పోతే ఎయిర్ పోర్ట్విమానం ఎక్కాలంటే సాయంత్రం వరకు ట్రాఫిక్‌లోనే ఇరుక్కుపోయే పరిస్థితి ఉంది. కోల్ కతా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న మురికి, సమస్యలు ఎక్కడా లేవు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్ కతా మొత్తం కాలుష్యం ఆక్రమించుకున్నది. పదేండ్లు ఏం చేయకుండా ఊరుకుంటే హైదరాబాద్వాటన్నింకంటే దరిద్రంగా తయారయ్యే పరిస్థితి ఉంది. ఆ నగరాల నుంచి మనం నేర్చుకోవాలి’’ అని అన్నారు.