- శంఖేశ్వర్ బజార్‌లో నివాసం ఉన్నట్లు గుర్తింపు
- అపార్ట్‌మెంట్‌లో సోదాలు
- ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్‌లో షెల్టర్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఆదివారం సోదాలు నిర్వహించింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్ అలీ షెల్టర్ తీసుకున్న శంఖేశ్వర్ బజార్‌లోని గ్రీన్ వ్యూ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గత నెల మొదటి వారంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఐఎస్‌ఐఎస్ మాడ్యూల్స్ కదిలికలపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఆగస్టు 8న సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా, టెర్రరిస్ట్ రిజ్వాన్‌ను ఢిల్లీలోని గంగాబక్ష్ మార్గ్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 30 ఎమ్ఎమ్ బోర్ పిస్టల్, మూడు లైవ్ కాట్రిడ్జ్, రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. రిజ్వాన్ ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడని, అతనిపై రూ.3 లక్షల రివార్డ్ ఉందని అధికారులు తెలిపారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎన్‌ఐఏ అధికారులు మరో కేసు నమోదు చేసి, రిజ్వాన్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. ఐఎస్‌ఐఎస్ పుణె మాడ్యూల్‌లో కీలకంగా వ్యహరిస్తున్నట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్‌ఐఎస్ కుట్రలో రిజ్వాన్ కీలకంగా వ్యవహరించినట్లు తేల్చారు. ఈ క్రమంలోనే రిజ్వాన్ అలీ నెట్‌వర్క్‌పై దృష్టి పెట్టారు.
రిజ్వాన్ కాంటాక్ట్స్‌పై నజర్..
రిజ్వాన్ ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో నివాసం ఉన్నట్లు గుర్తించారు. శనివారం రాత్రి రిజ్వాన్ అలీని తీసుకొని హైదరాబాద్‌కు వచ్చారు. ఆదివారం ఉదయం శంఖేశ్వర్ బజార్ గ్రీన్ వ్యూ అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి సైదాబాద్‌లో రిజ్వాన్ ఉన్నట్లు గుర్తించారు. రిజ్వాన్‌తో కాంటాక్ట్‌లో ఉన్న వారి వివరాలు సేకరించారు. ప్రతి రోజు అతని యాక్టివిటీస్‌కు సంబంధించిన సమాచారంతో స్థానికుల స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేశారు. విచారణ అనంతరం భారీ బందోబస్తు మధ్య రిజ్వాన్‌ను ఢిల్లీకి తరలించారు.