- జనవరి– జూన్ మధ్య లీజుకు 50 లక్షల చదరపు అడుగులు
- కిందటేడాదితో పోలిస్తే 40 శాతం అప్
- గచ్చిబౌలిలో ఆఫీసులకు పెరగనున్న గిరాకీ
- కుష్మన్ అండ్ వేక్‌ఫీల్డ్ రిపోర్ట్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ దూసుకుపోతోంది. దేశ విదేశీ కంపెనీలు ఇక్కడ ఆఫీసులను ఓపెన్ చేయడానికి రెడీ అవుతున్నాయి. దీంతో ఆఫీసుల లీజింగ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో సుమారు 50 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను డెవలపర్లు లీజుకు ఇచ్చారని కుష్మన్ అండ్ వేక్‌ఫీల్డ్ రిపోర్ట్ పేర్కొది. దీని ప్రకారం... కిందటేడాది మొదటి ఆరు నెలల్లో గ్రాస్ లీజింగ్ వాల్యూమ్ (జీఎల్‌వీ) 36 లక్షల చదరపు అడుగులు ఉంది. ఇది 40 శాతం గ్రోత్‌కు సమానం. మిడ్ సైజ్ ఆఫీస్‌లకు గిరాకీ బాగుంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో లీజుకిచ్చిన ఆఫీసుల్లో మిడ్ సైజ్ ఆఫీసుల (25 వేల నుంచి లక్ష చదరపు అడుగులు) వాటా 48 శాతంగా ఉంది.
కిందటేడాది మొదటి ఆరు నెలల్లో ఈ నెంబర్ 26 శాతంగా రికార్డయ్యింది. ఆఫీస్ స్పేస్‌ను ఎక్కువగా లీజుకు తీసుకున్న కంపెనీల్లో ఐటీ-, బీపీఎం కంపెనీలు ముందున్నాయి. ఆ తర్వాత ఫైనాన్షియల్ కంపెనీల వాటా ఎక్కువగా ఉంది. కంపెనీలు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో లీజుకు తీసుకున్న ఆఫీసుల్లో 80 శాతం మాదాపూర్ ఏరియాలో ఉన్నాయి. హైటెక్ సిటీలో తక్కువ ఆఫీసులు అందుబాటులో ఉండడంతో రానున్న రెండుమూడేళ్లలో గచ్చిబౌలి ఏరియాలో డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య సిటీలో 27 లక్షల చదరపు అడుగుల కొత్త ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది.
కంపెనీలకు అడ్డా...
బిజినెస్‌లకు హైదరాబాద్ ఫేవరెట్ సిటీగా మారింది. వ్యాపారం చేసుకోవడం ఇక్కడ సులభంగా ఉండడమే కారణం. రోజురోజుకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగవుతోంది. ప్రభుత్వం నుంచి పాలసీల రూపంలో మద్దతు దొరకడంతో కూడా కంపెనీలు తమ ఆఫీసులను ఈ సిటీలో ఓపెన్ చేయడానికి ఇష్టపడుతున్నాయి. రాజకీయ స్థిరత్వమూ ఉంది. లీజు ధరలు ముంబై, ఢిల్లీ వంటి సిటీలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. ట్యాలెంట్ పూల్బాగుండటంతో కంపెనీలు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయి.
టాప్ ఆఫీస్‌ల వైపే..
హై క్వాలిటీ గ్రేడ్ ఏ బిల్డింగ్‌లలో ఆఫీస్‌లకు డిమాండ్ పెరిగింది. దీనిని బట్టి బిజినెస్‌లు కొత్త తరం ఆఫీసులకు మొగ్గు చూపుతున్నాయని తెలుస్తోంది. వ్యాపారాన్ని విస్తరించుకోవడంలో సాయంగా ఆఫీసులు ఉండేలా కోరుకుంటున్నాయి. ఆఫీస్ స్పేస్‌లకు డిమాండ్ పెరుగుతుండడంతో రియల్ ఎస్టేట్ సెక్టార్‌లోని కో–లివింగ్, స్టూడెంట్ హౌసింగ్ వంటి ఇతర సెగ్మెంట్లలో కూడా డిమాండ్ కనిపిస్తోంది. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ మరింత విస్తరిస్తుందని కుష్మన్ అండ్ వేక్‌ఫీల్డ్ రిపోర్ట్ అంచనా వేసింది. ఇండియా ఆఫీస్ స్పేస్ మార్కెట్‌ను హైదరాబాద్ ముందుండి నడుపుతోందని కామెంట్ చేసింది.