ఓల్డ్ సిటీ మెట్రో నిర్వాసితులకు పరిహారం

ఓల్డ్ సిటీ మెట్రో నిర్వాసితులకు పరిహారం
  • నేడు చెక్కులు అందించనున్న మంత్రి పొన్నం, ఎంపీ ఒవైసీ
  • ఇప్పటి వరకు 169 మంది యజమానుల సమ్మతి

హైదరాబాద్  సిటీ, వెలుగు: ఓల్డ్  సిటీ మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం ప్రారంభమైనది. ఆ ప్రాంతంలోని మెట్రో వెళ్లే మార్గంలో ప్రభావిత ఆస్తుల యజమానులకు ప్రభుత్వం సోమవారం నష్టపరిహారం చెల్లించనుంది. మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్  ఎంపీ అసదుద్దీన్​  ఒవైసీ.. ఆ యజమానులకు చెక్కులు అందించనున్నారు. సెకండ్  ఫేజ్​లో భాగంగా ఓల్డ్ సిటీ మెట్రోను ఎంజీబీఎస్​ నుంచి చాంద్రాయణగుట్ట వరకు (7.5 కిలోమీటర్లు) కారిడార్– 6 కింద నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.2,741 కోట్లు ఖర్చవుతుందని మెట్రో అధికారులు అంచనా వేశారు. ఈ మార్గంలో మొత్తం 1,100 నిర్మాణాలు ప్రభావితం అవుతున్నట్లు గుర్తించారు. ఆయా ఆస్తులకు సంబంధించి నోటిఫికేషన్ ​కూడా విడుదల చేశారు.

ముందుగా ఎంజీబీఎస్​ నుంచి మీరాలం మండి వరకు భూసేకరణపైనే అధికారులు దృష్టి పెట్టారు. ఆ మార్గంలో లెఫ్ట్​ సైడ్​ 200 ఆస్తులు, రైట్ సైడ్​  200 ఆస్తులు మొత్తం 400 ఆస్తులకు నోటిఫికేషన్​ ఇచ్చారు. ఇందులో 169 మంది యజమానులు  తమ ఆస్తులను ఇవ్వడానికి ఒప్పుకున్నారు. వారిలో 40 మందికి సంబంధించిన ధ్రువీకరణ పూర్తయింది. ఆ 40 మంది యజమానులకు సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్​లో చెక్కులను పంపిణీ చేయనున్నారు. 

స్క్వేర్ యార్డుకు రూ. 81 వేలు చొప్పున చెల్లింపు

భూసేకరణ చట్టానికి లోబడి ఓల్డ్ సిటీ మెట్రో మార్గంలో మొదట స్క్వేర్​ యార్డుకు రూ.63 వేలు చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. అందుకు నిర్వాసితులు అంగీకరించకపోవడంతో కన్సంట్ అవార్డు కింద స్క్వేర్​ యార్డుకు రూ.81 వేలు చెల్లిస్తామని ప్రకటించారు. కన్సంట్ అవార్డుకు నిర్వాసితులు అందరూ అంగీకారం తెలిపారని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు రిలీఫ్  అండ్  రిహాబిలిటేషన్  చట్టం ప్రకారం  పునరావాస పరిహారం, తొలగించే నిర్మాణాలకు కూడా పరిహారం ఇస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి తెలిపారు. మరో 25 ఆస్తులకు సంబంధించి లీగల్​ సమస్యలు ఉన్నందున ఆ ఆస్తుల యజమానులకు జనరల్  కన్సంట్  కింద రూ. 63 వేలు త్వరలో అధికారులు చెల్లించనున్నారు.