హైదరాబాద్: ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మెట్రో ప్రాజెక్ట్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ప్రభావిత ఆస్తుల యజమానులకు సోమవారం(6.01.2025) చెక్కులను పంపిణీ చేయనున్నట్లు హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఓల్డ్ సిటీలో రెండో దశ మెట్రో పనులను ప్రారంభించడానికి మార్గం సుగమం అవుతోంది. ప్రభావిత ఆస్తుల యజమానులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడానికి ముహూర్తం ఖరారు చేసింది. కారిడార్-6 లో ఎంజీబీఎస్ - చంద్రాయణ్ గుట్ట మార్గంలో 1100 ప్రభావిత ఆస్తులు ఉండగా, పెద్ద ఎత్తున వాటి యజమానులు స్వచ్ఛందంగా తమ స్థలాలను మెట్రో రైలు నిర్మాణం కోసం ఇవ్వడానికి ముందుకు వచ్చారని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
ఇంతవరకు 169 మంది వారి యొక్క అనుమతి పత్రాలను ఇచ్చారని ఆయన తెలిపారు. వాటిలో 40కి పైగా ఆస్తుల యాజమాన్యానికి సంబంధించిన ధ్రువీకరణ పూర్తయిందన్నారు. తొలి దశలో ఈ 40కి పైగా ఆస్తుల యజమానులకు ఈ నెల 6వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు చెక్కుల పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. వారికి నష్టపరిహారాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెక్కుల రూపంలో అందజేయనున్నారు.
ప్రభావిత ఆస్తులకు చదరపు గజానికి రూ. 81,000/- ఇవ్వడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్ నిర్ణయించారని, దీనితో పాటు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ చట్టం ప్రకారం, పునరావాస పరిహారం, తొలగించే నిర్మాణాలకు కూడా నష్టపరిహారాన్ని అర్హులైన ఆస్తుల యజమానికి ఇవ్వడం జరుగుతుందని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. భూసేకరణ చట్టానికి లోబడి నష్టపరిహారాన్ని జిల్లా కలెక్టర్ నిర్ణయం ప్రకారం చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. లక్డీకాపుల్ దగ్గర ఉన్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు త్వరితగతిన మెట్రో పనులు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.