- కొత్త ఏడాదిలో పనులు ప్రారంభానికి అధికారుల కసరత్తు
- శరవేగంగా కొనసాగుతున్న భూసేకరణ
- మొత్తం 1,100 ఆస్తులపై ప్రభావం
- ఇప్పటికే 500 ప్రాపర్టీల సేకరణ పూర్తి
- తాజాగా మరో 200 ఆస్తుల సేకరణకు నోటిఫికేషన్ రిలీజ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓల్డ్ సిటీ మెట్రో పనులు వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫేజ్ 2లో మొత్తం 6 మెట్రో కారిడార్లు ఉండగా, ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట కారిడార్ కు సంబంధించిన భూసేకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ మార్గంలో మొత్తం1,100 ఆస్తులు ప్రభావితం అవుతుండగా భూసేకరణ చట్టం 2013 కింద ఇప్పటికే 500 ఆస్తుల సేకరణ పూర్తయింది.
తాజాగా మరో 200 ప్రాపర్టీల సేకరణకు సంబంధించి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం డిక్లరేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ 200 వందల ఆస్తుల సేకరణ పూర్తయితే, డిసెంబర్ చివరికల్లా బాధితులకు కలెక్టర్నష్టపరిహారం అందించనున్నారు. మిగతా భూసేకరణ ప్రక్రియను కూడా డిసెంబర్ చివరికల్లా పూర్తి చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకవేళ అనుకున్న సమయానికి భూసేకరణ పూర్తయితే, జనవరి 2025లో పాత బస్తీ మెట్రో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మార్గానికి అంచనా వ్యయం రూ. 2,800 కోట్లుగా డీపీఆర్‌లో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గత మార్చిలో శుంకుస్థాపన కూడా చేశారు. గత బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఓల్డ్ సిటీ మెట్రో లైన్ కు రూ.500 కోట్లు కేటాయించింది.
చాంద్రాయణగుట్ట వరకు విస్తరణ
మెట్రో ఫేజ్1లో మొత్తం మూడు కారిడార్లు పూర్తి కాగా, 69 కి.మీ. మేర మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. మెట్రో ఫేజ్–1లో ఎంజీబీఎస్– ఫలక్‌నుమా 5.5 కి.మీ. కారిడార్ పనులు చేపట్టాల్సి ఉండగా, భూసేకరణలో జాప్యం వల్ల పనులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఫేజ్–2 పనుల విస్తరణలో భాగంగా ఎంజీబీఎస్– ఫలక్‌నుమా కారిడార్ ను నాగోల్– ఎయిర్ పోర్టు రూట్ ను కలిపేలా ఫలక్ నుమా నుంచి చాంద్రయణ గుట్ట వరకు పొడిగించింది. దీంతో 7.5 కిలోమీటర్ల మేరకు ఓల్డ్ సిటీ మెట్రో విస్తరించింది. సెంకడ్ ఫేజ్ లో మొత్తం 6 కారిడార్లు ఉండగా, ప్రస్తుతం ఫోర్త్ సిటీకి సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. మిగతా ఐదు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌లను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం ఈ డీపీఆర్ లు కేంద్ర ప్రభుత్వం వద్ద అనుమతి కోసం పెండింగ్ లో ఉన్నాయి.
7 స్టేషన్లు.. 7.5 కిలోమీటర్లు
ఎంజీబీఎస్ – చాంద్రాయణ గుట్ట మార్గం మొత్తం 7.5 కిలోమీటర్లు ఉండగా, ఎంజీబీఎస్, సాలర్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఆలియాబాద్, ఫలక్ నుమా, చాంద్రాయణ గుట్ట స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మార్గంలో ఆస్తుల సేకరణ కోసం మెట్రో అధికారులు సాధారణ సర్వేతో పాటు, లైడార్ డ్రోన్ సర్వే కూడా చేపట్టారు. జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ ప్రకారం.. ఓల్డ్ సిటీ మెట్రో మార్గంలో 100 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ చేపట్టనున్నారు. మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేసే ప్రాంతాల్లో 120 అడుగుల మేరకు భూసేకరణ చేస్తున్నారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం ఇప్పటివరకు 500 ఆస్తులను మెట్రో అధికారులు సేకరించారు. ఈ మార్గంలో103 మతపరమైన, సున్నితమైన కట్టడాలు కూడా ప్రభావితం అవుతున్నాయి. వీటి పరిరక్షణ విషయంలో మెట్రో అధికారులు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మతపరమైన, సున్నిత కట్టడాలను విలక్షణ ఇంజినీరింగ్ పద్ధతుల ద్వారా సంరక్షించేలా పిల్లర్లు, స్టేషన్ల వద్ద జాగ్రత్తగా సర్దుబాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.