కనీస సౌకర్యాలు కల్పించాలని ఉస్మానియా ఆర్థో, జనరల్ సర్జరీ విభాగాల జూడాల సమ్మె
హైదరాబాద్: ఉస్మానియా జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఉస్మానియా ఆర్థో, జనరల్ సర్జరీ విభాగాల జూడాలు సమ్మె చేపట్టారు. పేరుకి పెద్దాసుపత్రి అయినా… కనీస సౌకర్యాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు ఉస్మానియా జూడాలు. సరైన ఆపరేషన్ థియేటర్స్ లేవు.. స్ట్రేచర్స్ ఉండవు.. మాస్క్ లు కూడా ఇవ్వరు.. పూర్తిగా చెబితే రాష్ట్ర ప్రభుత్వం పరువు పోతుందని మౌనంగా సహిస్తూ వస్తున్నామన్నారు. ప్రభుత్వానికి బార్ లు, పబ్ ల మీద ఉన్న శ్రద్ధ… నిరు పేదల ఆరోగ్యం.. సరైన సేవలు అందించే హాస్పిటల్స్ మీద కనిపించడం లేదన్నారు. ఆర్థో పెడిక్ విభాగంలో సుమారు 60 మంది, జనరల్ సర్జరీ విభాగం లో మరో 120 మంది వరకు జూడాలు ఉస్మానియా లో సేవలు అందిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ ల ఏర్పాటు, పోస్ట్ ఆపేరేషన్ కేర్ కోసం ఆక్సిజన్ సప్లై ఉన్న వార్డ్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వారంతా మంగళవారం నుంచి ఎలెక్టీవ్ సేవలను బాయ్ కాట్ చేశారు. ఇప్పటికే అధికారులకు, సూపరింటెండెంట్ కు నోటీసులు ఇచ్చి విసిగిపోయామని… అందుకే పాండమిక్ లో కూడా సమ్మె బాటపట్టామంటున్నారు.