అహ్మదాబాద్: పాకిస్తాన్‌తో జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో తాను ఒత్తిడికి లోనయ్యానని హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. అందుకే ఆరంభంలో లయ తప్పిందన్నాడు. అయితే కెప్టెన్ రోహిత్‌తో మాట్లాడి వెంటనే తన లైన్‌ను కరెక్ట్ చేసుకుని అబ్దుల్లా షఫీక్ వికెట్ తీశానని చెప్పాడు. ‘షఫీక్ వికెట్ కోసం నేను వేసిన తొలి బౌన్సర్ వర్కౌట్ కాలేదు. దీంతో ఒత్తిడి పెరిగింది.
నెర్వస్‌గా కూడా ఫీలయ్యా. వెంటనే రోహిత్‌తో మాట్లాడా. రెండో బౌన్సర్ వేయాలన్న ట్రిక్‌తో ముందుకెళ్లా. కానీ లాస్ట్ సెకన్‌లో ఫుల్లర్‌ను ప్రయోగించి ఎల్బీ చేశా. నాకు తెలిసి షఫీక్ కూడా మళ్లీ బౌన్సర్ వేస్తాడని భావించి ఉండొచ్చు’ అని సిరాజ్ పేర్కొన్నాడు. ఇక జూనియర్ స్థాయి క్రికెట్ ఆడే రోజుల నుంచే మొతెరా పిచ్‌పై మంచి అవగాహన ఉందని బుమ్రా అన్నాడు. ఆ ఎక్స్‌పీరియెన్స్ పాక్‌తో మ్యాచ్‌లో రాణించడానికి బాగా దోహదపడిందన్నాడు.
‘ఈ గ్రౌండ్‌లో నేను చాలా జూనియర్ క్రికెట్ ఆడాను. ఇది ఫ్లాట్ వికెట్. నా గత అనుభవాన్ని ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నించాను. వికెట్ గురించి తెలుసుకోవడానికి ఒక బౌండరీ ఇవ్వడం ముఖ్యమే. అప్పుడు నాలుగు బౌండరీలను ఆపొచ్చు. అదే నేను ట్రై చేశా. బాగా సక్సెస్ అయ్యింది’ అని బుమ్రా పేర్కొన్నాడు.