
అంబులెన్స్ సైరన్ మోగిస్తూ వస్తుంది అంటే చాలు.. ఎంత ట్రాఫిక్‌లో ఉన్నా సైడ్ ఇవ్వటానికి ప్రయత్నిస్తారు. రెడ్ సిగ్నల్ పడినా అంబులెన్స్ వెళ్లేందుకు దారి ఇస్తారు. ఇక హైదరాబాద్ సిటీలో అయినా ఇదే తీరు. వెనక అంబులెన్స్ సైరన్ వినిపిస్తోంది అంటే.. ఎంత ట్రాఫిక్ ఉన్నా దారి ఇస్తారు. ఇటీవల కొంతమంది అంబులెన్స్ డ్రైవర్లు ఆ సైరన్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. అంబులెన్స్‌లో పేషెంట్లు లేకపోయినా సైరన్ వేస్తూ స్పీడ్‌గా వెళుతున్నారు. ఈ ఘటనపై దృష్టి పెట్టిన హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేయటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే పంజాగుట్ట సర్కిల్ దగ్గర.. ఓ అంబులెన్స్ తనిఖీ చేయగా పోలీసులు అవాక్కయ్యారు.. పబ్లిక్ పరేషాన్ అయ్యారు. ఆ అంబులెన్స్ డ్రైవర్ చేసిన పనికి కొడదామన్నంత కోపం వచ్చింది పబ్లిక్ కు..
పూర్తి వివరాల్లోకి వెళితే..
2025, మార్చి 4వ తేదీ మధ్యాహ్నం పంజాగుట్ట సిగ్నల్స్ దగ్గర అతి వేగంగా సైరన్ తో వస్తున్న అంబులెన్స్ వెళుతుంది. అనుమానం వచ్చిన పోలీసులు దాన్ని ఆపారు. అంబులెన్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో పేషెంట్లు లేరు.. కుక్క ఉంది.. అంబులెన్స్ లో కుక్కను చూసి షాక్ అయ్యారు పోలీసులు. ఆ కుక్క కూడా నిక్షేపంగా ఉంది.. బౌ బౌ అంటూ అరుస్తుంది కూడా.. ఇంత నిక్షేపంగా ఉన్న కుక్క కోసం.. సైరన్ వేసుకుని.. అతి వేగంగా ఎందుకు వెళుతున్నావ్ అంటూ డ్రైవర్ ను ప్రశ్నించారు పోలీసులు. ఆ డ్రైవర్ చెప్పిన సమాధానంతో మరింత షాక్ అయ్యారు పోలీసులు.
ఈ కుక్క మా అంబులెన్స్ ఓనర్‌ది.. ఇంట్లో పెంచుకునే కుక్క ఇది.. ఈ కుక్కకు మియాపూర్ లోని ఆస్పత్రిలో పిల్లలు పుట్టుకుండా ఆపరేషన్ చేయించటానికి తీసుకెళుతున్నానంటూ చెప్పుకొచ్చాడు. కుక్కను తీసుకెళుతున్నావ్ సరే.. మరి సైరన్ ఎందుకు వేశావ్.. ఎందుకు అంత స్పీడ్ గా వెళుతున్నావ్ అంటే మాత్రం నోటి మాట రాలేదు. దీంతో అంబులెన్స్ ఓనర్, డ్రైవర్ పై కేసు పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. అంబులెన్స్ సైరన్ దుర్వినియోగంపై కేసు పెట్టి విచారణ చేసి.. చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు పోలీసులు.
అందరు వెధవలా ఇలా ఉండరు.. అందరూ ఇలా ఉంటారని అనుకోవటం తప్పు.. ఎవరో ఒక అంబులెన్స్ డ్రైవర్ చేసిన తప్పు వల్ల మిగతా అన్ని అంబులెన్స్ పై తప్పుడు అభిప్రాయం ఏర్పడే ప్రమాదం లేకపోలేదు అంటున్నారు పోలీసులు. అంబులెన్స్ కు దారి ఇవ్వటం అనేది మానవత్వంతో కూడుకున్నది.. ఒకరి ప్రాణాలను కాపాడినట్లు అవుతుంది అంటున్నారు. ఇలాంటి అంబులెన్స్ డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు పోలీసులు.