
హైదరాబాద్, వెలుగు: యూనివర్సిటీల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ లెక్చరర్లకు యూజీసీ పే స్కేల్ వర్తింపజేయాలని, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం రూపొందించిన జీవో నంబర్ 21ను సవరించాలని డిమాండ్ చేస్తూ పార్ట్ టైమ్ లెక్చరర్లు గురువారం సెక్రటేరియెట్ ను ముట్టడించారు. దీంతో పార్ట్ టైమ్ లెక్చరర్లను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా.. జీవో నంబర్ 21ను సవరించాలని, యూజీసీ పే స్కేల్ అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, పార్ట్‌టైమ్ లెక్చరర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పార్ట్ టైమ్ లెక్చరర్లను సెక్రటేరియెట్ తోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైమ్ లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. జీవో నంబర్ 21లో పార్ట్ టైమ్ లెక్చరర్ల సర్వీసుకు మార్కులు ఇవ్వలేదని దీంతో తమకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగుతున్నదన్నారు.