హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో అసంపూర్తిగా మిగిలిపోయిన పనుల కారణంగా వాటర్ లాగింగ్సమస్యతో జనానికి ఇబ్బందులు తప్పడంలేదు. వానాకాలం మొదలై కురిసిన మొదటి రెండు వర్షాలకే ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరడంతో ఆ ఇండ్లను కొందరు ఖాళీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం గ్రేటర్లో జరుగుతున్న నాలాలు, బాక్స్ డ్రెయిన్ల నిర్మాణాల్లో కొన్ని పూర్తయినప్పటికీ, మరికొన్ని స్లోగా జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం 37 ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ నాలాల నిర్మాణాన్ని చేపట్టింది.
అందులో 27 పనులు ఇప్పటి వరకు పూర్తయ్యాయి. అయితే, ప్రస్తుతం కురుస్తున్న వానల కారణంగా నిర్మాణం పూర్తయిన కొన్ని ప్రాంతాలతోపాటు, పనులు జరుగుతున్న చోట వాటర్ లాగింగ్ సమస్య ఏర్పడి జనాలు ఇబ్బందులు పడుతున్నారు. మల్కాజిగిరిలోని దినకర్ నగర్, ఇశ్రాన్ బాగ్, మిర్జాల్ గూడ, భారతీ నగర్, రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో సమస్య ఎక్కువవుతున్నప్పటికీ అధికారులు
పట్టించుకోవడంలేదు.
గతేడాదే పూర్తిచేస్తామని చెప్పి..
గతేడాది వానాకాలంలోపే నాలాల నిర్మాణం పూర్తిచేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించినప్పటికీ ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనా కూడా పనులు పూర్తికాలేదు. డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేస్తామని చెప్పినప్పటికీ ఆ విషయంపై ఫోకస్ పెట్టలేదు. కనీసం డ్యామేజ్ అయిన స్థానాల్లో మ్యాన్‌హోల్స్ కవర్లు కూడా ఏర్పాటు చేయడంలేదు. వరదల వల్ల ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గ్రేటర్లో నాలాల పనులు ప్రారంభించిన అధికారులు వారిని పూర్తిచేయడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. నాలాల పనుల కోసం ప్రత్యేకంగా ఎస్ఎన్డీపీని ఏర్పాటు చేసినా, ఇప్పటికే నాలుగు సార్లు డెడ్‌లైన్ గడిచిపోయినా నాలాలు మాత్రం అందుబాటులోకి రాలేదు. కొన్ని చోట్ల పనులు ఈ మధ్య కాలంలో పూర్తయ్యేలా లేవు. లంగర్ హౌస్, టోలిచౌకిలో ప్రధాన రోడ్లపై పనులు చాలా స్లోగా జరుగుతుండటంతో జనానికి ఇబ్బందులు తప్పడంలేదు. లంగర్ హౌస్‌లో కేవలం 30 శాతం పనులు మాత్రమే జరిగాయి. ఇప్పుడు వానలు పడుతుండటంతో జరుగుతున్న పనులను నిలిపివేయాల్సి వస్తోంది.
ఎంత మొత్తుకున్నా పనులు చేయలే..
వానాకాలానికి ముందు ఎంత మొత్తుకున్నా నాలాలు, బాక్స్ డ్రెయిన్ల పనులు చేయలేదు. కనీసం కౌన్సిల్ లోనైనా ఈ అంశాలపై చర్చిద్దామంటే సమావేశాలు సరిగ్గా జరగడంలేదు. ఏదో ఒక సాకుతో సమావేశాలను వాయిదా వేస్తున్నారు. మన్సురాబాద్ డివిజన్లో సకాలంలో పనులు చేసి ఉంటే ఇప్పుడు ఇబ్బందులు తప్పేవి. వర్షపు నీరు ఇండ్లలోకి వస్తుండటంతో జనం ఇండ్లను ఖాళీ చేసి వెళుతున్నారు. వారికి జీహెచ్ఎంసీ ఏం సమాధానం చెబుతుంది?
– కొప్పుల నర్సింహారెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్(బీజేపీ)
ఈ ప్రాంతాల్లో తీవ్రమైన ఇబ్బందులు
మన్సురాబాద్‌లోని సరస్వతి నగర్లో బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో శనివారం కురిసిన వర్షానికి అక్కడ నీరు బయటకు వెళ్లేందుకు దారిలేక కాలనీల్లోకి చేరింది. కొన్ని ఇండ్లలోకి వర్షపు నీరు చేరడంతో అందులో ఉండేవారు ఆ ఇండ్లను ఖాళీ చేశారు. బయటకు వచ్చేందుకు కూడా వీలులేకపోవడంతో మరి కొందరు ఇండ్లకే పరిమితమయ్యారు. ఈ పనులు వేగంగా చేపట్టాలని అధికారులను ఎప్పటి నుంచే కోరుతున్నప్పటికీ పూర్తిచేయలేదని స్థానికులు ఆరోపించారు. నల్లకుంటలోని పద్మ కాలనీలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. పనులు పూర్తికాక నీరు నిలిచిపోవడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడంలేదు. పనులు పూర్తిచేయాలని మేయర్ సైతం ఆదేశించినప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి.