హైదరాబాద్‌‌లో ఆధార్ అప్‌‌డేట్‌‌కు తిప్పలు.. రీజినల్ సెంటర్‌‌‌‌ చుట్టూ తిరుగుతున్న జనం

హైదరాబాద్‌‌లో ఆధార్ అప్‌‌డేట్‌‌కు తిప్పలు.. రీజినల్ సెంటర్‌‌‌‌ చుట్టూ తిరుగుతున్న జనం
  • ఏండ్లకేండ్లుగా పరిష్కారం కాని సమస్యలు 
  • పిల్లల బయోమెట్రిక్ అప్‌‌డేట్‌‌ కోసమే ఎక్కువ మంది రాక 
  • 5 నుంచి 15 ఏండ్లలోపే అప్‌‌డేట్‌‌ చేసుకునేందుకు చాన్స్ 
  • 5 రాష్ట్రాల నుంచి వస్తున్న పబ్లిక్.. రోజుకు 250 మందికే టోకెన్ 
  • టోకెన్ల కోసం రోజుల తరబడి పడిగాపులు  

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆధార్‌‌‌‌లో అప్‌‌డేట్స్ కోసం జనం తిప్పలు పడుతున్నారు. కొన్ని రకాల అప్‌‌డేట్స్ కోసం హైదరాబాద్‌‌లోని ఆధార్ రీజినల్ సెంటర్‌‌‌‌ చుట్టూ తిరుగుతున్నారు. ఏండ్లకేండ్లుగా తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని బాధితులు వాపోతున్నారు.  ముఖ్యంగా చిన్నపిల్లల బయోమెట్రిక్ అప్‌‌‌‌డేట్, ఫొటో మిస్ మ్యాచ్ లాంటి సమస్యలతోనే ఎక్కువ మంది వస్తున్నారు. పిల్లలకు చిన్నప్పుడు ఆధార్ తీస్తే.. 5 నుంచి 15 ఏండ్ల లోపు వాళ్ల ఫింగర్ ప్రింట్స్ అప్‌‌‌‌డేట్ చేయించాల్సి ఉంటుంది. ఇది స్థానిక ఆధార్ సెంటర్లు, మీ సేవా సెంటర్లలో ఎక్కడైనా చేస్తారు. 

కానీ15 ఏండ్లు దాటితే మాత్రం లోకల్‌‌‌‌ సెంటర్లలో చేయడానికి అవకాశం లేదు. అలాంటి వాళ్లందరూ హైదరాబాద్‌‌‌‌లోని రీజినల్ సెంటర్‌‌‌‌‌‌‌‌కు తరలివస్తున్నారు. అలాగే ఆధార్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌డేట్స్‌‌‌‌కు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కొన్ని పరిమితులు విధించింది. పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, జెండర్, ఐరిస్, ఫింగర్ ప్రింట్స్ వంటివి అప్‌‌‌‌డేట్ చేసుకునేందుకు కొన్ని నిబంధనలు పెట్టింది. పేరు, ఇంటి పేరు, స్పెల్లింగ్ తప్పిదాలను రెండుసార్లు మాత్రమే అప్‌‌‌‌డేట్ చేసుకోవచ్చు. ఇక జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి మాత్రమే సవరణ చేసుకునేందుకు అవకాశం ఉంది. 

అడ్రస్, మొబైల్ నెంబర్, ఈ–మెయిల్, ఫొటో, ఐరిస్, ఫింగర్ ప్రింట్స్ ఎన్నిసార్లయినా అప్‌‌‌‌డేట్ చేసుకోవచ్చు. వీటిలో పరిమితులు దాటిన తర్వాత లోకల్‌‌‌‌ సెంటర్లలో అప్‌‌‌‌డేట్ చేసే అవకాశం లేదు. అలాంటి వాళ్లందరూ అప్‌‌‌‌డేట్ల కోసం రీజినల్ సెంటర్‌‌‌‌‌‌‌‌కు తరలివస్తున్నారు. కాగా, ఆధార్ సెక్యూర్‌‌‌‌‌‌‌‌గా ఉండాలంటే పదేండ్లకు ఒకసారి అప్‌‌‌‌డేట్ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
 

ఏండ్ల తరబడి తిప్పుతున్నరు.. 

హైదరాబాద్‌‌‌‌లోని అమీర్‌‌‌‌‌‌‌‌పేటలో ఆధార్ రీజినల్ సెంటర్ ఉంది. తెలంగాణ, ఏపీ, ఒడిశా, చత్తీస్‌‌‌‌గఢ్, అండమాన్ అండ్ నికోబార్‌‌‌‌‌‌‌‌ ప్రజలు ఆధార్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేసుకోవాలంటే ఇక్కడికే రావాలి. దీంతో ఆధార్‌‌‌‌‌‌‌‌లో సవరణల కోసం వేలాది మంది హైదరాబాద్‌‌‌‌కు తరలివస్తున్నారు. ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌ వద్ద ప్రతిరోజు ఉదయం 7 గంటలకు టోకెన్లు ఇస్తారు. అదీ రోజుకు 250 మందికే ఇస్తారు. దీంతో అప్‌‌‌‌డేట్ కోసం వచ్చినోళ్లందరూ తెల్లవారుజామునే సెంటర్ వద్ద క్యూ కడుతున్నారు. టోకెన్ దొరకనోళ్లు లాడ్జీలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో బస చేసి మరుసటి రోజు క్యూలో నిలబడిన పరిస్థితి నెలకొంది. 

పని పూర్తయ్యే వరకు ఇలాగే పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. సెంటర్ వద్ద ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. టోకెన్ దొరకడమే గగనం అవుతున్నదని, ఒకవేళ టోకెన్ దొరికిచ్చుకొని లోపలికి వెళ్లినా పని మాత్రం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, వేలిముద్రలు, ఫొటోలు మిస్‌‌‌‌మ్యాచ్ లాంటి చిన్నపాటి సవరణలకే అధికారులు ఏండ్ల తరబడి తిప్పుతున్నారని వాపోతున్నారు. 

కారణాలు అడిగితే చెప్పకుండానే.. రేపు రా.. మాపు రా అంటూ తిప్పుతున్నారని, కొద్దిరోజుల్లో అప్‌‌‌‌డేట్ అవుతుందంటూ సాకులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సెంటర్ వద్ద పైరవీకారులదే హవా నడుస్తున్నదని బాధితులు అంటున్నారు. వాళ్లతో వెళ్తే టోకెన్ కూడా అక్కర్లేకుండా పని పూర్తి చేసుకోవచ్చని చెబుతున్నారు. పని కావాలంటే పాలకులు లేదా అధికారుల నుంచి ఫోన్ చేయించాలని లేదంటే సెంటర్‌‌‌‌‌‌‌‌లో పనిచేసే సిబ్బంది అయినా తెలిసి ఉండాలని.. అట్లయితేనే పని పూర్తయ్యే పరిస్థితులు ఉన్నాయని వాపోతున్నారు. 

స్పందించని  డిప్యూటీ డైరెక్టర్ జనరల్..

ఆధార్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌డేట్ల కోసం 5 రాష్ట్రాల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై తెలుసుకునేందుకు వెళ్లగా రీజినల్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పి.సంగీత స్పందించలేదు. పని ఒత్తిడి వల్లనే ఆమె స్పందించడం లేదని సిబ్బంది అంటున్నారు. 

నాలుగైదు సార్లు అప్లై చేసిన..  

నేను హైదరాబాద్‌‌‌‌లో బీటెక్ సెకండియర్ చదువుతున్నాను. నా ఫింగర్ ప్రింట్స్ మిస్ మ్యాచ్ అయ్యాయని 9 నెలల కింద ఇక్కడికి వచ్చి అప్లై చేశాను. పది రోజుల్లో అప్డేట్ అవుతుందని చెప్పారు. కానీ ఇప్పటికే నాలుగైదు సార్లు వచ్చి అప్లై చేసినా సమస్య పరిష్కారం కాలేదు. వచ్చినప్పుడల్లా వారం, పది రోజులని చెబుతున్నారు. ఆధార్ అప్డేట్ కాకుంటే, నాకు  స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్ రాదు. 
-  సుష్మిత, ఖమ్మం జిల్లా

ప్రభుత్వ పథకాలు కోల్పోతున్నం

నాకు ఇద్దరు పిల్లలు. ఆధార్ కార్డులో ఫొటోలు మిస్ మ్యాచ్ అయ్యాయి. నాలుగేండ్లుగా రీజినల్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. వచ్చినప్పుడల్లా నెల, రెండు నెలలు అంటూ తిప్పుతున్నారు. ఆధార్ కార్డు లేక ప్రభుత్వ పథకాలు కోల్పోతున్నాం.
-  శ్రీనివాస్, భీమవరం, ఏపీ