హైదరాబాద్ లో ఆర్జే వెంచర్స్ రూ.150 కోట్ల ఫ్రాడ్

  • ప్రీ లాంచింగ్​ ఆఫర్ పేరిట 600 మంది నుంచి  రూ.50 లక్షల చొప్పున వసూలు
  • న్యాయం చేయాలని సీసీఎస్ ముందు బాధితుల ఆందోళన

బషీర్ బాగ్, వెలుగు: ప్రీ లాంచింగ్ ఆఫర్​పేరిట ఆర్జే వెంచర్స్ ఎండీ భాస్కర్ గుప్తా, డైరెక్టర్ సుధారాణి తమను మోసం చేశారంటూ పలువురు బాధితులు శుక్రవారం బషీర్ బాగ్ లోని సీసీఎస్ ముందు ఆందోళనకు దిగారు. దాదాపు 600 మంది నుంచి రూ.150కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. బాధితులు సాయి, రాకేశ్, ఉపేందర్ మాట్లాడుతూ.. ఆర్జే వెంచర్స్​ ఎండీ, డైరెక్టర్​ నారాయణ్ ఖేడ్, ఘట్​కేసర్, పఠాన్ చెరు ప్రాంతాల్లో అపార్ట్​మెంట్లు, ఫాం ల్యాండ్స్​ డెవలప్ ​చేస్తున్నట్లు 2020లో ప్రముఖులతో ప్రకటనలు ఇప్పించారని తెలిపారు.

ప్రీ లాంచ్​ఆఫర్​ అందుబాటులో ఉందని చెప్పడంతో, నిజమేనని నమ్మిన తాము రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు డబ్బు చెల్లించామని పేర్కొన్నారు. నాలుగేండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని వాపోయారు. భాస్కర్ గుప్తా, సుధారాణి మాటలు నమ్మి మోసపోయామన్నారు. ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారన్నారు. గట్టిగా నిలదీసిన వారికి చెక్కులు ఇచ్చారని, అవి బౌన్స్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వస్తే.. వెంచర్ ఆఫీస్​సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉందని, అక్కడ ఫిర్యాదు చేయాలని తెలిపారన్నారు. ఆర్జే వెంచర్స్ ఆస్తులు అమ్మి, తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు.