
- ఐదు పసికూనలను క్రూరంగా చంపిన యువకుడు
- మచ్చబొల్లారంలోని అపార్ట్‌మెంట్‌లో ఈ నెల 14న ఘటన
అల్వాల్, వెలుగు: రోజుల వయస్సున్న ఐదు కుక్కపిల్లలను ఓ వ్యక్తి దారుణంగా చంపాడు. వాటిని నేలకేసి కొట్టి, కాళ్లతో తొక్కి, రాడ్డుతో చితకబాది మరీ చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అల్వాల్ పీఎస్ పరిధిలో ఈ నెల 14న జరగ్గా... ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మచ్చ బొల్లారం వీబీ సిటీ కాలనీలోని వీబీ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఆశీశ్ ఓకుక్కను పెంచుకుంటున్నాడు. ఈ నెల 14న ఇతడు సెల్లార్‌లోకి తన కుక్కతో రాగా, తన కుక్క దగ్గరకు రోజుల వయస్సున్న కొన్ని వీధి కుక్క పిల్లలు రావడంతో ఆగ్రహానికి గురయ్యాడు. సహనం కోల్పోయి వాటిని గోడ కేసి కొట్టాడు.
అవి చావకపోవడంతో మళ్లీ మళ్లీ గోడకు విసిరికొట్టాడు. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కాడు. రాడ్‌తో విచక్షణారహితంగా కొట్టడంతో అవన్నీ అక్కడే కన్నుమూశాయి. తర్వాత అతడు అక్కడి నుంచి వెళ్లిపోగా, చనిపోయిన కుక్కపిల్లలను అపార్ట్‌మెంట్‌వాసులతో పాటు స్థానికులు గుర్తించారు.
సీసీ కెమెరాలు చెక్చేయగా అసలు విషయం బయటపడింది. అశీశ్‌ను అడిగితే తన కుక్క దగ్గరకు వీధి కుక్కలు రావడం నచ్చలేదని, వాటి అరుపులు తనను ఇరిటేట్ చేశాయని, అందుకే చంపానని చెప్పాడు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.