న్యూడ్ కాల్స్ తో ఎన్నారైలకు వల వేస్తున్న కేటుగాడు... అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

న్యూడ్ కాల్స్ తో ఎన్నారైలకు వల వేస్తున్న కేటుగాడు... అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

డేటింగ్ యాప్స్ ద్వారా ఎన్నారైలను మోసగిస్తున్న మాజీ టెక్కీని బెంగళూరులో అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. అమ్మాయిలా ఫోజులిచ్చి బాధితులను ఆకర్షించి వారిని న్యూడ్ ఫోటోలు తీసుకొని బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలిపారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తీ వివరాలు ఇలా ఉన్నాయి. రిద్ద్ బేడీ అనే మాజీ టెక్కీ కాలిఫోర్నియాలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివి, ఆరేళ్లపాటు అమెరికాలో ఉండి భారత్‌కు తిరిగి వచ్చాడు. ఉద్యోగం మానేసిన రిధ్ ఆన్లైన్లో మోసాలకు పాల్పడటం స్టార్ట్ చేశాడు.

నిందితుడు ఆన్‌లైన్ డేటింగ్ వెబ్‌సైట్ Seeking.com లో నకిలీ ఖాతాను క్రియేట్ చేసి అమ్మాయిగా నటిస్తూ, బాధితుల దగ్గర నుండి పర్సనల్ ఫోటోలను కలెక్ట్ చేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడేవాడని తెలిపారు పోలీసులు. కాలిఫోర్నియాలో ఉంటున్న ఓ హైదరాబాదీ యువకుడు రిధ్ చేతిలో మోసపోయి సుమారు రూ.2 లక్షలు మోసపోయానంటూ కంప్లైంట్ చేయటంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. బాధితుడి దగ్గర నుండి పర్సనల్ ఫోటోలు తీసుకున్న రిధ్ డబ్బులు ఇవ్వాలని పదేపదే బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే తన ఫోటోలను సోషల్ మీడియాలో, ఫ్రెండ్స్ సర్కిల్స్ లో షేర్ చేస్తానని బెదిరింపులకు పాల్పడే వాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అప్రమత్తంగా ఉంటూ మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. సైబర్ మోసానికి ఫిర్యాదులను 1930 కి కాల్ చేసి లేదా అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తమ దృష్టికి తేవాలని పోలీసులు సూచిస్తున్నారు.