
- పెద్ద అమౌంట్ అయితే హవాలా... తక్కువైతే ర్యాపిడో, ఉబర్, డీటీడీసీ సర్వీసుల వాడకం
- ముంబై, ఢిల్లీ నుంచి తెప్పించి, సిటీలో విక్రయాలు
- మాటువేసి ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
బషీర్‌బాగ్, వెలుగు: బడి పిల్లలకు నిషేధిత ఈ సిగరెట్లను అమ్ముతున్న ఇద్దరు అన్నదమ్ములను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, హైదరాబాద్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. స్కూళ్ల వద్ద ఈ సిగరెట్లు అమ్ముతున్నారన్న సమాచారంతో సిటీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెట్టారు. అబిడ్స్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్, సెయింట్ మెరిస్ జూనియర్ కాలేజీ, సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్, రోసారీ కాన్వెంట్ స్కూల్, సుజాత హైస్కూల్ వద్ద మూడు రోజులుగా గస్తీ కాశారు.
సోమవారం నాంపల్లి హజ్ హౌస్ ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు సాదిక్ లలానీ, అనిల్ లలానీ స్కూల్ విద్యార్థులకు ఈ సిగరెట్లు విక్రయిస్తుండగా, పట్టుకున్నారు. నిందితులపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, రూ.25 లక్షలు విలువ చేసే 1,217 ఈ సిగరెట్లు, రూ.18 వేల నగదు , 225 యూఎస్ డాలర్లు, 100 కెనడా డాలర్లు సీజ్ చేశారు.
వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి..
ఈజీ మనీ కోసం మైనర్లను టార్గెట్ చేసుకున్న నిందితులు ‘సిద్’ అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, అందులో విద్యార్థులను యాడ్ చేశాడు. ఎప్పటికప్పుడు కొత్త ప్రొడక్ట్స్ లు పరిచయం చేస్తూ అమ్మకాలు చేస్తున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు , సోదరులు , స్నేహితుల ద్వారా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు ఈ సిగరేట్స్, వేప్స్ ను ఢిల్లీకి చెందిన అమిత్, ముంబై కు చెందిన వసీం నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పెద్ద మొత్తంలో రూ.50 వేలకు పైగా అమ్మకాలు ఉంటే హవాలా ఆపరేటర్స్ నుంచి , రూ.5 వేలకు తక్కువగా ఉంటే ఉబర్ , రాపిడో , డీటీడీసీ కొరియర్ సర్వీసులను వినియోగిస్తున్నారు.
ఈ సిగరెట్లు వాడుతున్న 13 మంది మైనర్లను గుర్తించి, వారి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అలాగే 400 మందికి పైగా వాట్సాప్ గ్రూపులో సభ్యులుగా ఉన్నారని, వారి వివరాలను సేకరించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఇల్లీగల్‌గా వీటిని విద్యార్థులకు అందజేస్తున్న రాపిడో, ఉబేర్, డీటీడీసీ సంస్థలపై ఆధారాలు సేకరించాక చర్యలు చేపడతామన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్, ఏపీలో కోటి రూపాయల వరకు ఈ వ్యాపారం జరిగినట్లు గుర్తించారు.
గంజాయి తాగుతున్న నలుగురు అరెస్ట్
మెహిదీపట్నం, వెలుగు: హుమాయున్ నగర్లో గవర్నమెంట్స్కూల్ వద్ద ఈద్గా గ్రౌండ్లో గంజాయిని విక్రయించడంతోపాటు సేవిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను సోఫియావుద్దీన్, సయ్యద్ దావూద్ అలీ, రోమన్ అలీ, అయూబ్ గా గుర్తించారు.
మత్తు ఇంజక్షన్లకు విద్యార్థి బలి
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు ఎల్బీ నగర్, వెలుగు: మత్తు ఇంజక్షన్లకు అలవాటు పడి, ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు తన స్నేహితులు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సుధాకర్ వివరాల ప్రకారం.. బాలాపూర్ పరిధిలోని సుల్తాన్‌పూర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ నాసర్ (17) ఎం.ఎస్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు.
ఇదే ప్రాంతానికి చెందిన షాబాజ్(22 ), మరో విద్యార్థి(17) స్నేహితులు. కొన్నాళ్లుగా ఈ ముగ్గురు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు. షహీన్ నగర్‌కు చెందిన సాహిల్ అనే యువకుడు వద్ద గుర్తు తెలియని మాత్రలు, ఇంజక్షన్లను(మత్తు ఇంజక్షన్స్) నాసర్ అతని స్నేహితులు కొనుగోలు చేసి నిర్మానుష్య ప్రదేశాల్లో వాటిని తీసుకుంటున్నారు. ఈ నెల 17న మత్తు ఇంజక్షన్లు, మాత్రలను కొనుగోలు చేసి నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి తీసుకున్నారు.
అనంతరం ఒక్కసారిగా ఈ ముగ్గురు స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికులు వెంటనే నాసర్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరిని ఓవైసీ వైద్యశాలలో చేర్పించారు. అయితే ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాసర్ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.