పానీపూరీ బండి మాటున గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ రావు తెలిపిన వివరాల ప్రకారం.. అబిడ్స్ వాసి ముస్తాపూర్ ప్రశాంత్.. తాజ్మహాల్ హోటల్ క్రాస్ రోడ్, భారతీ విద్యా భవన్ రోడ్ ప్రాంతాల్లో పానీపూరి బండ్లను నడుపుతున్నాడు. వీటితో వచ్చే ఆదాయం సరిపోవట్లేదని భావించి ఈ బండ్ల దగ్గరే గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అమ్మాలని నిర్ణయించుకున్నాడు.
ధూల్పేటకు చెందిన గౌతమ్ అనే వ్యక్తి నుంచి రూ.25 వేలకు గంజాయి కొనుక్కుని రూ.45 వేలకు అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ప్రకారం రామకృష్ణ థియేటర్ గేట్దగ్గర జూన్ 7 న గంజాయి అమ్మేందుకు యత్నించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని 2.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.