హై ఫై జాబ్​..అయినా డ్రగ్స్ పెడ్లర్​గా మారిన యువతి.. జీతం సరిపోక ఆఫ్రికన్​తో కలిసి దందా

హై ఫై జాబ్​..అయినా డ్రగ్స్ పెడ్లర్​గా మారిన యువతి.. జీతం సరిపోక ఆఫ్రికన్​తో కలిసి దందా
  • మియాపూర్​లో యువతి అరెస్టు

గచ్చిబౌలి, వెలుగు: కార్పొరేట్​సంస్థలో పెద్దస్థాయి ఉద్యోగం చేస్తున్న ఓ యువతి డ్రగ్స్ సరఫరాదారుగా మారింది. మాదాపూర్ డీసీపీ ఆఫీస్​లో టీజీనాబ్ డీఎస్పీ హరిచంద్రరెడ్డితో కలిసి డీసీపీ వినీత్ గురువారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఝార్ఖండ్ కు చెందిన శతాబ్ది మన్నా(28) బీబీఏ చేసేందుకు 2019లో బెంగళూరుకు వెళ్లింది. అక్కడే చదువు పూర్తి చేసి, ఓ కార్పొరేట్ సంస్థలో మంచి ఉద్యోగం చేస్తూ అద్దెకు ఉంటోంది. అయితే, ఆఫ్రికా నుంచి చదువు కోసం బెంగళూరుకు వచ్చిన అంతరాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్ వారెన్ కొకరాంగతో ఆమెకు 2024లో పరిచయం ఏర్పడింది. 

ఆమెకు జాబ్ చేస్తుండగా వచ్చిన జీతం సరిపోకపోవడం, ఆర్థిక సమస్యల కారణంగా కొకరాంగ ఇచ్చిన డ్రగ్స్ ను తన ఇంట్లో భద్రపరిచేందుకు అంగీకరించింది. ఇదే క్రమంలో కొకరాంగ చెప్పిన వ్యక్తులకు 100, 200 గ్రాముల చొప్పున డ్రగ్స్ ను సరఫరా చేసేది. అనంతరం కొకరాంగ ఆదేశాలతో బెంగళూరు, చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేయడం ప్రారంభించింది. ఇదే సమయంలో బెంగళూరు పోలీసుల దృష్టి వీరి కదలికల మీద పడడంతో హైదరాబాద్​దందా చేయాలని ప్లాన్ వేశారు. 

అందులో భాగంగా పలువురికి డ్రగ్స్ సరఫరా చేయడానికి మియాపూర్​కు వచ్చిన శతాబ్ది మిన్నాను గురువారం పక్కా సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద రూ.6 లక్షల విలువైన 60 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు కొకరాంగ పరారీలో ఉన్నాడు.