నకిలీ ఇన్సూరెన్స్ ముఠా అరెస్ట్

శంషాబాద్, వెలుగు: శంషాబాద్​లో నకిలీ ఇన్సూరెన్స్ పేపర్లతో అమాయకులను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. ఈ కేసు వివరాలను శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్ శుక్రవారం వెల్లడించారు. ఈ నెల16న రిలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన మృణాల్ కుమార్ తమ కంపెనీ పేపర్లు ఫోర్జరీ అయ్యాయని శంషాబాద్ ఆర్జీఐ పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్బీ నగర్​లో శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి వద్ద కొన్ని నకిలీ ఇన్సూరెన్స్ పేపర్లు గుర్తించి విచారించారు.

అతడి ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో అసలు సూత్రధారి శివ కుమార్​తో సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద రిలయన్స్, టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ పత్రాలతో పాటు కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని మరో 11 మంది సభ్యుల కోసం గాలిస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్​ తెలిపారు.