హైదరాబాదీలు బీ అలర్ట్: 10వేల నకిలీ ఆధార్ కార్డులు 15వేల నకిలీ ఓటర్ కార్డులు

నకిలీ ఓటర్ ఐడీ, ఆధార్, పాస్ పోర్ట్, పాన్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, మహంకాళీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నిర్వాహకుడు ఎలగం రాజ్ కుమార్ తో పాటు అతనికి సహకరించిన విజయలక్ష్మి, పల్లవి, బండి శంకర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మహబూబ్, గిరిరాజ్ అనిల్ కుమార్ లను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.

ముఠా దగ్గర నుంచి మూడు కంప్యూటర్లు, ఒక ల్యాప్ టాప్, 2 ప్రింటర్లు , బయో మెట్రిక్ మిషన్, కస్టమర్స్ డేటా ఎంట్రీ బుక్ ను సీజ్ చేశారు. ఈ కేసు వివరాలను హైదరాబాద్ బషీర్ బాగ్ లోని సీసీఎస్ ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర గురువారం ( నవంబర్ 14, 2024 ) వెల్లడించారు.

10వేల నకిలీ ఆధార్ అకార్డులు 15వేల నకిలీ ఓటర్ కార్డులు

ముఠా నిర్వాహకుడు ఎలగం రాజ్ కుమార్ గత ఏడాది జూన్ 10న నకిలీ సర్టిఫికెట్లు కేసులో అరెస్ట్ అయినట్లు డీసీపీ తెలిపారు. ఆ సమయంలో  డేటాను క్రాష్ చేయడం వల్ల నకిలీ సర్టిఫికెట్ల వివరాలు లభ్యం కాలేదన్నారు. జైలు నుంచి విడుదల అయిన తరువాత కూడా అతను మళ్లీ దందాను కొనసాగించాడన్నారు. మిగతా ఐదుగురితో కలిసి పెద్దసంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లను చేయించాడని తెలిపారు.

ఏడాదిగా 50 వేల ఓటర్ కార్డులు అతని సెంటర్ నుంచి అప్రూవ్ అవ్వగా .. అందులో నకిలీవే 15 వేలని గుర్తించారు. 10 వేల నకిలీ ఆధార్ కార్డులు, 50 ఫేక్ పాస్ పోర్ట్ లు, 1500 ఫేక్ పాన్ కార్డులు, వందలాది ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు తయారు చేశారని చెప్పారు. వీటిని నిందితులు తమకు ఇష్టమొచ్చినవారికి అమ్మేశారని పోలీసులు తెలిపారు. నకిలీ పాస్ పోర్ట్ లు ఎక్కువగా నేపాలీలకు అమ్ముకున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.