హైదరాబాద్ లో 55శాతం పెరిగిన మోసాలు

హైదరాబాద్ లో 55శాతం పెరిగిన మోసాలు
  • గతేడాదితో పోలిస్తే ఈసారి 55 శాతం పెరిగిన మోసాలు
  • 328 అత్యాచారాలు, 85 హత్యలు
  • 192 కిడ్నాప్‌‌లు, రూ.21.36 కోట్లు చోరీ
  • యాన్యువల్ రిపోర్టును రిలీజ్ చేసిన సీపీ అంజనీకుమార్


సిటీలో సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందని, గతేడా దితో పోలిస్తే ఈ సారి 55 శాతం కేసులు ఎక్కువగా నమోదైనట్లు సిటీ సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ ఏడాది  సిటీ కమిషనరేట్ పరిధిలో 85 హత్యలు, 328 అత్యాచారాలు, 2,417 దొంగతనాలు జరిగాయన్నారు. రూ.21 కోట్ల 36 లక్షలను ప్రాపర్టీ అఫెండర్స్ కొట్టేయగా..ఇందులో రూ.11కోట్ల 57 లక్షలను రికవరీ చేశామన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రాపర్టీ అఫెండర్స్ కేసులు 1,375 అదనంగా రిజిస్టర్‌‌‌‌ అయ్యాయన్నారు. ఈ ఏడాది కోర్టులు 81 శాతం మందికి శిక్షలు విధించాయన్నారు. బుధవారం హుస్సేన్ సాగర్ లోని బుద్ధుని విగ్రహం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీపీ అంజనీకుమార్ ఈ ఏడాది సిటీ కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను వెల్లడించారు.  జాయింట్‌‌ సీపీ షిఖా గోయల్, 5 జోన్ల డీసీపీలు, టాస్క్‌‌ఫోర్స్,ట్రాఫిక్,ఎస్‌‌బీ,ఇంటెలిజెన్స్ డీసీపీలతో కలిసి యాన్యువల్ రిపోర్టును రిలీజ్ చేశారు. 

278 మంది సైబర్ నేరస్తుల అరెస్ట్
క్రైమ్‌‌ను కంట్రోల్‌‌ చేసేందుకు టెక్నాలజీను  వాడుతున్నట్లు సీపీ అంజనీకుమార్ చెప్పారు. 155260 హెల్ప్‌‌ లైన్‌‌ నంబర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బాధితులకు న్యాయం జరుగుతోందన్నారు. ప్రతి పీఎస్​లో సైబర్ క్రైమ్ కంప్లయింట్లు తీసుకుంటున్నట్లు తెలిపారు. గతేడాది 1463 సైబర్ కేసులు కాగా.. ఈ ఏడాది 5064 కంప్లయింట్లు వచ్చాయన్నారు.  బాధితులు అందించిన వివరాల ఆధారంగా1,206 బ్యాంక్ అకౌంట్లలోని రూ.80 కోట్ల 54 లక్షల క్యాష్‌‌ ను  ఫ్రీజ్ చేశామన్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 265 మంది ఇంటర్‌‌ ‌‌స్టేట్‌‌ అఫెండర్స్‌‌,13 మంది విదేశీయులను  అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వైట్‌‌ కాలర్ అఫెన్సెస్‌‌లో రూ.23 కోట్లు విలువ చేసే 16 ప్రాపర్టీలను సీజ్ చేసినట్లు చెప్పారు.

2077 కిలోల గంజాయి , డ్రగ్స్ స్వాధీనం
 గతేడాదితో పోలిస్తే ఈ సారి భారీగా గంజాయి, డ్రగ్స్ ను పట్టుకున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. గతేడాది 96 కేసులు నమోదు కాగా.. 1,037 కిలోల గంజాయి, 970 ఎంఎల్ హాష్ ఆయిల్, 1,705 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని 241 మందిని అరెస్ట్ చేశామన్నారు.  ఈ ఏడాది 246 కేసులు నమోదు కాగా.. 2,077 కిలోల గంజాయి, 2,318 ఎంఎల్ హాష్​ ఆయిల్, 316 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని.. 602 మందిని అరెస్ట్ చేశామన్నారు. వీరిలో ఇద్దరు విదేశీయులున్నట్లు సీపీ చెప్పారు.

4.4 లక్షల సీసీటీవీ కెమెరాలు 
 కమ్యూనిటీ పోలీసింగ్‌‌లో భాగంగా సిటీలోని 5 జోన్లలో 4,40,299 సీసీటీవీ కెమెరాలను ఇన్‌‌స్టాల్‌‌ చేశామన్నారు. సిటీలోని అన్ని ఏరియాలను  సీసీ కెమెరాలతో జియో ట్యాగింగ్ చేశామన్నారు. దోపిడీలు, దొంగతనాలు ,కిడ్నాప్, రేప్ కేసులో నిందితులను ట్రేస్ చేస్తున్నామన్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ లు, ఫింగర్ ప్రింట్స్, క్రిమినల్ డేటా బేస్ ఆధారంగా కేసులను ఛేదించామన్నారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌‌ ద్వారా సిటిజన్లకు కనెక్ట్ అయ్యామన్నారు. హాక్ ఐ, ఫేస్ బుక్, ట్విట్టర్, మొబైల్‌‌ యాప్స్‌‌తో కంప్లయింట్స్ తీసుకుని పరిష్కరిస్తున్నామన్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో నిందితులను సీసీటీవీ ఫుటేజ్‌‌ ఆధారంగా గుర్తిస్తున్నామని  సీపీ వెల్లడించారు.