సెల్​ఫోన్ రికవరీకి వెళ్తే..105 దొరికినయ్ .. నిందితుడు అరెస్ట్

సెల్​ఫోన్ రికవరీకి వెళ్తే..105 దొరికినయ్ ..  నిందితుడు అరెస్ట్

మెహిదీపట్నం, వెలుగు: ఒక సెల్​ఫోన్ పోయిందని పోలీసులు రికవరీకి వెళ్తే.. ఓ దొంగ వద్ద మరో 105 మొబైల్స్ దొరికాయి. ఈ కేసు వివరాలను హైదరాబాద్  లంగర్ హౌస్ పీఎస్​లో గోల్కొండ ఏసీసీ సయ్యద్ ఫయాజ్ శుక్రవారం వెల్లడించారు. లంగర్ హౌస్ లోని మొఘల్ నగర్ కు చెందిన మహ్మద్ జలీల్ ఈ నెల 8న తన మొబైల్ పోయిందని స్థానిక పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన కాడి అశోక్ ను నిందితుడిగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.

 అతని వద్ద మరో105 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడికి సహకరించిన గణేశ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన లంగర్ హౌస్ ఇన్​స్పెక్టర్​రఘుకుమార్ తో పాటు ఇతర క్రైమ్ సిబ్బందిని డీసీపీ అభినందించారు. నిందితుడుపై గతంలో  హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఇప్పటికే 10 కేసులు నమోదైనట్లు చెప్పారు.