
హైదరాబాద్ సిటీ /జూబ్లీహిల్స్, వెలుగు: ఆన్‌లైన్ ద్వారా సట్టా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్, మధురానగర్ పోలీసులు దాడులు చేసి అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కుమ్రం భీం జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన సోనులే శ్రీకాంత్, సోనులే తిరుపతి, గుర్లే హరీష్, గుర్లే సతీష్ కుమార్, అడే వినోద్ మధురానగర్‌లోని ఎల్లారెడ్డిగూడ దివ్య ఎన్‌క్లేవ్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని అంతర్జాతీయ ఆన్‌లైన్ గేమింగ్ సట్టా రాకెట్ నడిపారు.
.ఇతరుల పేరుతో సిమ్‌కార్డులు తీసుకొని, వెబ్‌సైట్ ద్వారా యువకులను ఆకర్షించి, మొదట లాభాలు చూపించి నమ్మించారు. ఆ తర్వాత బాధితులు ఎక్కువ పెట్టుబడి పెట్టగా డబ్బు కోల్పోయారు. క్యూఆర్ కోడ్, గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరిపిన నిందితులు ఓ యూట్యూబ్ చానెల్‌ను కూడా ఉపయోగించారు. గురువారం దాడులు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 3 మాక్‌బుక్స్, ట్యాబ్, 2 కలర్ ప్రింటర్లు, 18 సెల్‌ఫోన్లు, రూ.1.55 లక్షల నగదు, రూ.2,13,697 ఉన్న బ్యాంకు ఖాతాను సీజ్ చేశారు.