- హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల భారీ ఆపరేషన్
బషీర్ బాగ్, వెలుగు: వివిధ రాష్ట్రాల్లో సామాన్యులను మోసగించి రూ.5.29 కోట్లు దోచుకున్న 23 మంది సైబర్ మోసగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి అరెస్టు చేశారు. కేటుగాళ్లు ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో వీరిపై 30 సైబర్ క్రైం కేసులు నమోదుకాగా.. దేశవ్యాప్తంగా 328 కేసులు ఉన్నాయి. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని సీసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ సైబర్ క్రైం డీసీపీ కవిత వివరాలను మీడియాకు వెల్లడించారు.
హైదరాబాద్ సైబర్ క్రైంకు చెందిన ఐదు ప్రత్యేక బృందాలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టి సైబర్ మోసగాళ్లను అరెస్టు చేశాయన్నారు. నిందితుల నుంచి రూ.40 వేల నగదు, 25 మొబైల్ ఫోన్స్, 45 సిమ్ కార్డులు, 28 చెక్ బుక్స్, 23 డెబిట్– క్రెడిట్ కార్డులు, ఒక ల్యాప్ టాప్ , 3 క్యూ ఆర్ కోడ్ స్కానర్లు, షెల్ కంపెనీ స్టాంప్ లను సీజ్ చేశామని వెల్లడించారు.
ఇటీవల70 ఏళ్ల వృద్ధుడిని మోసగించిన కేసులో యూపీకి చెందిన కమలేష్ కుమారి (60) అనే మహిళను అరెస్ట్ చేశామని తెలిపారు. అలాగే...డిజిటల్ అరెస్ట్ కేసులో కేసులో గుజరాత్ కు చెందిన బరియా సంజీవ్ కుమార్, కాళీ రోహిత్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.34 లక్షలు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ కవిత పేర్కొన్నారు.