హారన్ మారితే.. జరిమానాల రీ సౌండ్ 48 గంటల్లో.. 600 కేసులు

నగరంలో అక్రమంగా సైరన్‌లు వాడుతున్న వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. వ్యక్తిగత వాహనాల్లో రహస్యంగా సైరన్లు పెట్టుకుని రోడ్లపై హల్ చల్ చేస్తున్న వారిపై  ట్రాఫిక్ పోలీసులు 600 కేసులు నమోదు చేశారు.  సైరన్ల వ్యవహారంపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కు ఓ నెటిజన్ ట్విట్టర్ లో ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన ఆయన..  నగరంలో అక్రమంగా సైరన్‌లు వాడుతున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.  

దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు గత 2 రోజులు నుంచి  స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు..   అదనపు పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) జి సుధీర్ బాబు ప్రత్యక్ష పర్యవేక్షణలో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది.  నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేసి సైరన్‌లను  ట్రాఫిక్ పోలీసులు  తొలగిస్తున్నారు.  మరోసారి సైరన్లు వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.  నగరంలో దాదాపుగా 600వాహనాల్లో సైర్లను తొలిగించామని పోలీసులు తెలిపారు.  

ఈ తనిఖీల్లో ప్రజాప్రతినిధుల బంధువులు, నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు తమ వాహనాలకు సైరన్‌లు ఉపయోగిస్తున్నట్లు ట్రాఫిక్ అధికారులు గుర్తించారు. ట్రాఫిక్ పోలీసులు కొన్ని సందర్భాల్లో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్ల బంధువుల వాహనాలను కూడా ఆపి సైరన్‌లను తొలగించారు. RTA నిబంధనల ప్రకారం , అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు, పోలీసులు మినహాయిస్తే తప్ప సామాన్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ సైరన్‌లు వాడకూడదని ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టం చేశారు.