IPL ఫిక్సింగ్ ఆరోపణలపై హైదరాబాద్ పోలీసుల ఆరా.. ఐదుగురిపై అనుమానం..! 

IPL ఫిక్సింగ్ ఆరోపణలపై హైదరాబాద్ పోలీసుల ఆరా.. ఐదుగురిపై అనుమానం..! 

హైదరాబాద్: ఐపీఎల్‌ 18లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‎కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు బీసీసీఐ గుర్తించింది. లీగ్‎లో 5 హాట్ ఫేవరేట్ టీమ్ ఫ్రాంచైజీలను సదరు బిజినెస్‎మెన్ కాంటాక్ట్ చేసినట్లు ఆధారాలు సేకరించింది. మ్యాచ్ ఫిక్సింగ్‎కు తెర వెనక ప్రయత్నాలు షురూ కావడంతో అప్రమత్తమైన బీసీసీఐ.. ఈ మేరకు అన్ని ఫ్రాంఛైజ్‎ల యజమాన్యాలు, ఆటగాళ్లు, జట్ల మేనేజర్లు, కోచ్‎లు, ఇతర సిబ్బందిని అప్రమత్తం చేసింది.

ఎవరూ ఫిక్సింగ్ వలలో చిక్కుకోవద్దని బీసీసీఐ హెచ్చరికలు పంపింది. హైదరాబాద్‎కు చెందిన వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు బీసీసీఐ ఆరోపించడంతో నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ఆరోపణలపై ఆరా తీయడం మొదలుపెట్టారు. 5 హాట్ ఫేవరేట్ టీమ్ ఫ్రాంచైజీలను వ్యాపారవేత్త కలిశాడని బీసీసీఐ చెప్పడంతో.. దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులు బీసీసీఐని కోరారు. 

►ALSO READ | DC vs RR: స్టార్క్ బ్యాక్ ఫుట్ నో బాల్.. ఆసీస్ ఫాస్ట్ బౌలర్‌కు అంపైర్ బిగ్ షాక్

అలాగే.. ఐపీఎల్‎లో ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న హైదరాబాద్‌కు చెందిన ఆ వ్యాపారవేత్త ఎవరనేదానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇందులో భాగంగా ఐదుగురు వ్యాపారవేత్తలపై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి కదలికలను నిశితంగా పరిశీలిస్తోన్న పోలీసులు.. ఏ మాత్రం తేడా అనిపించిన వెంటనే నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. 

ఐపీఎల్ 18వ ఎడిషన్ సగం పూర్తి అయ్యాక మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఐపీఎల్‎లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఫిక్సింగ్ ఆరోపణలపతో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ రెండేళ్ల నిషేధం కూడా ఎదుర్కొన్నాయి. తాజాగా ఐపీఎల్ లో మరోసారి ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది.