మొబైల్ ఫోన్ చోరీలను అరికట్టేందుకు పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఫోన్ దొంగలు ఏమాత్రం తగ్గట్లేదు.. ఫోన్లలో సెక్యూరిటీ ఫీచర్స్ ఎంత అప్డేటెడ్ గా వస్తున్నప్పటికీ కేటుగాళ్లకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఫోన్ దొంగతనాలు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి.. అడుగడుగునా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ వాటి కళ్లుగప్పి మరీ ఫోన్లు దొంగలిస్తున్నారు కేటుగాళ్లు. హైదరాబాద్ లో నెలరోజుల్లో ఒక్క ఏరియాలోనే వేల సంఖ్యలో ఫోన్లు మిస్ అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోండి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మూడు కోట్ల రూపాయల విలువజేసే 1016 ఫోన్లు రికవర్ చేశారు పోలీసులు.
రాచకొండ కమిస్నరేట్ పరిధిలో నెల రోజులలో CEIR పోర్టల్ ద్వారా సుమారు 1400 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినట్లు తెలిపారు. రాచకొండ సిపి సుధీర్ బాబు.మొబైల్ ఫోన్ పోయిన వెంటనే CEIR పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాలని.. అలా చేయడం ద్వారా మొబైల్ లొకేషన్ ట్రేస్ చేసి వాటిని రికవరీ చేయడం జరుగుతుందని తెలిపారు.
మొబైల్ రికవరీ చేయడం కోసం కమిషనరేట్ పరిధిలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఎల్ బి నగర్ లో 655 ఫోన్లు , మల్కాజిగిరిలో 290 , భువనగిరిలో 71 ఫోన్లను రికవర్ చేసినట్లు తెలిపారు కమిషనర్. ఫోన్ దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే.. త్వరగా ట్రేస్ చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు కమిషనర్.