పోలీసుల మెరుపు వేగం.. 3 గంటల్లో కిడ్నాపర్ల అరెస్టు

పోలీసుల మెరుపు వేగం.. 3 గంటల్లో కిడ్నాపర్ల అరెస్టు
  • కేవలం 3 గంటల్లో కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు 
  • నలుగురు కిడ్నాపర్ల అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు

హైదరాబాద్: తన భర్తను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారని బాధితురాలి ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీసులు మెరుపువేగంతో స్పందించారు. కిడ్నాపర్లు డిమాండ్ చేసిన డబ్బును బాధితురాలికిచ్చి.. ఆమె ద్వారా కిడ్నాపర్ల ఆచూకీ కనిపెట్టి అరెస్టు చేశారు. కిడ్నాప్ జరిగిన  3గంటల్లోనే కేసును ఛేదించి ‘‘శభాష్ పోలీస్..’’ అనిపించుకున్నారు హైదరాబాద్ పోలీసులు.  వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలో అమర్నాథరెడ్డి అనే వ్యక్తి కిడ్నాప్ అయ్యాడు. ఇవాళ ఉదయం మాదాపూర్ ఆఫీసుకు వెళ్లిన ఆయనను ఆరుగురు దుండగులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆయన భార్యకు ఫోన్ చేసి మీ ఆయనను కిడ్నాప్ చేశాం.. డబ్బులివ్వకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో అంత డబ్బు ఎక్కడి నుండి ఎక్కడినుండి తేవాలో అర్థం కాక బాధితురాలు అమర్నాథరెడ్డి భార్య కల్పనారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి పోలీసులు అభయం ఇవ్వడమే కాదు..కిడ్నాపర్లు అడిగినంత డబ్బును రెడీ చేసి ఆమెకు ఇస్తామని అభయం ఇచ్చారు. బాధితురాలికి కిడ్నాపర్లు చెప్పినట్లు చేయమని ఆదేశించి సాంకేతికంగా నిఘా పెట్టారు. బాధితురాలు వెంటనే డబ్బు అరేంజ్ చేసుకున్నానని ఎక్కడికి రావాలంటూ కిడ్నాపర్లు కోరగా.. శ్రీనగర్ కాలనీకి తీసుకురమ్మని చెప్పారు. కిడ్నాపర్లలో ప్రదీప్ నటరాజన్, లోకేష్ లు  వనస్థలిపురం నుండి శ్రీనగర్ కాలనీకి వచ్చి బాధితురాలి దగ్గర డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించారు.  లోకేష్ శ్రీనగర్ కాలనీలో డబ్బులు తీసుకుని వెళ్లిపోతుండగా.. మఫ్టీలో ఉన్న పోలీసులు వెంటపడడం దూరంలో ఉంటూ గమనిస్తున్న ప్రదీప్ నటరాజన్ గుర్తించి పారిపోయాడు. లోకేష్ ను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, వెస్ట్ జోన్ జాయింట్ సీపీ ఆర్ శ్రీనివాస్ లు తమదైన శైలిలో విచారించారు. అమరనాథ్ రెడ్డి కి కిడ్నాపర్లకు మధ్య ఆర్థిక పరమైన విభేదాలతో కిడ్నాప్ జరిగినట్లు గుర్తించారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వక పోతే చైన్నై కి తీసుకొని పోయి హత్య చేస్తామని చెప్పి భయపెట్టిన కిడ్నాపర్లు నల్గొండ వద్ద ఉన్నట్లు మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించి అరెస్ట్ చేశారు. మొత్తం నలుగురిని అరెస్టు చేయగా ఇద్దరు పరారైనట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

కోర్ట్ ఆదేశాలతో మీడియా బులిటెన్ రిలీజ్..ఇవాళ రాష్ట్రంలో 189 మందికి కరోనా పాజిటివ్

మనిషి చావుకు కారణమైన కోడిపై కేసు

కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటును కుదిపేసే పెద్ద తప్పు చేశాడు..

కాంట్రాక్ట్ ఉద్యోగులను.. రెగ్యూలర్ చేస్తే.. కొత్తగా భర్తీ చేసినట్లా?