మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు పని చేయాలని ఎన్నికల పరిశీలకుడు సంజయ్ కుమార్ మిశ్రా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో వ్యయ పరిశీలకులు డాక్టర్ కుందన్ యాదవ్, డాక్టర్ జీవీ తేజస్వి, పోలీస్ అబ్జర్వర్ ఇళక్కియా కరుణాగరన్ లతో కలిసి ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ, రిటర్నింగ్ అధికారులు, పోలీసులు, నోడల్ ఆఫీసర్లతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కలెక్టర్ జి రవినాయక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. ఎస్పీ హర్షవర్ధన్ పోలీస్ బందోబస్తు, పోలీసు అధికారులు, సిబ్బంది నియామకం తదితర అంశాలను అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లారు. జడ్చర్ల, మహబూబ్నగర్, దేవరకద్రరిటర్నింగ్ ఆఫీసర్లు ఎస్. మోహన్ రావు, అనిల్ కుమార్, నటరాజ్, డీఆర్వో రవికుమార్ పాల్గొన్నారు. అనంతరం ఐడీవోసీలో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ కేంద్రాన్ని, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
గద్వాల : ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం బాధ్యతగా గుర్తించాలని గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. శనివారం ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా గద్వాలలోని రాజీవ్ మార్గ్ లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్ నమూనాలను ప్రారంభించారు. ఐడీవోసీ ఆవరణలో ఏర్పాటు చేసిన ‘ఐ ఓట్ ఫర్ షూర్’ సెల్ఫీ పాయింట్ ను అడిషనల్ కలెక్టర్ అపుర్వ్ చౌహాన్ తో కలిసి ప్రారంభించారు. స్వీప్ నోడల్ ఆఫీసర్ రమేశ్ బాబు, డీపీఆర్వో చెన్నమ్మ, తహసీల్దార్ నరేందర్
పాల్గొన్నారు.
కంట్రోల్ రూమ్ పరిశీలన..
వనపర్తి : నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎన్నికల పరిశీలకుడు రాజీవ్ మల్హోత్రా, సోమేశ్ మిశ్రా కోరారు. శనివారం వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అబ్జర్వర్ రాజీవ్ మల్హోత్రా మాట్లాడుతూ పోలింగ్ శాతం పెరిగేలా ప్రజలను చైతన్యం చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కృషి చేయాలని చెప్పారు. జనరల్ అబ్జర్వర్ సోమేశ్ మిశ్రా మాట్లాడుతూ శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని కోరారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఉన్నా , ఏవైనా ఫిర్యాదులు ఉన్నా వెంటనే తమను సంప్రదించాలన్నారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ రక్షిత కె మూర్తి పాల్గొన్నారు.
ఫిర్యాదులు చేయవచ్చు..
నాగర్ కర్నూల్ టౌన్ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఫిర్యాదులను నేరుగా లేదంటే ఫోన్లో తెలియజేయవచ్చని ఎన్నికల పరిశీలకుడు మిథిలేశ్మిశ్రా తెలిపారు. ఫిర్యాదులు స్వీకరించేందుకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు కొల్లాపూర్ సోమశిలలోని పర్యాటక వసతి గృహంలో అందుబాటులో ఉంటానని తెలిపారు. 8977౦61896 నెంబర్కు ఫోన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.