హైదరాబాద్ లో భారీగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు లంగర్‌హౌస్ పోలీసులు. డీసీఎంలో గంజాయి తరలిస్తుండగా పక్కా ప్రణాళికతో ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. పట్టుబడ్డ వారి వద్ద నుంచి 200 కిలోల గంజాయి, ఒక డీసీఎం వాహనం, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.60లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
నిందితులు శ్రీనివాసరావు, సత్తిబాబు లు ఏపీకి చెందిన వారిగా.. డ్రగ్స్ పెడ్లర్ ఎండీ హబీబ్ రాజేంద్రనగర్‌కు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన పర్వేజ్, జావీద్, మంగేష్, ఎపికి చెందిన నగేష్, పాండుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తుండగా.. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అందించిన సమాచారం మేరకు ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. లంగర్‌హౌస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి రవాణా చేస్తే డబ్బులు బాగా వస్తాయని ఆశతో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు.