![హైదరాబాద్ సిటీలో 2 క్వింటాళ్ల గంజాయి పట్టివేత : గల్లీల్లో అమ్మటానికి భారీ స్కెచ్](https://static.v6velugu.com/uploads/2025/02/hyderabad-police-seize-200-kilos-of-ganja-a-man-arrested_GUu8HabohC.jpg)
పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారన్న వార్తలు తరచూ వింటూనే ఉంటాం.. అయితే, ఒక కిలోనో రెండు కిలోలో.. మహా అయితే.. పదుల కిలోల్లో గంజాయి పట్టుబడటం సహజం. ఒకేసారి క్వింటాళ్లలో గంజాయి పట్టుబడటం చాలా అరుదు. హైదరాబాద్ లో రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గురువారం ( ఫిబ్రవరి 7, 2025 ) అర్థరాత్రి తనిఖీలు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 2 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నిందితుడి దగ్గర నుంచి 2 క్వింటాళ్ల గంజాయితో పాటు ఒక కార్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు పోలీసులు. పక్కా సమాచారం మేరకు చంద్రాయన్ గుట్ట దగ్గర మాటు వేసి హ్యుందాయ్ కార్ లో గంజాయిని, నిందితుడు జాదవ్ శివరాం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు పోలీసులు.జాదవ్ శివరాం 2015 సంవత్సరం నుండి గంజాయి సరఫరా చేస్తున్నాడని.. నిందితుడు హైదరాబాద్ లోని తన మిత్రుడు జైపాల్ తో కలిసి సరఫరా చేస్తున్నాడని తెలిపారు పోలీసులు.
ALSO READ | ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతిని గర్భవతిని చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే..
ఒరిస్సా నుండి సుభాష్ అనే వ్యక్తి దగ్గర నుండి రూ. 4 వేలకు కేజీ చొప్పున నిందితుడు జాదవ్ శివరాం గంజాయి కొనుగోలు చేసాడని...నిందితుడు గంజాయితో బుధవారం( ఫిబ్రవరి 5న) శంషాబాద్ కు చేరుకున్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. శంషాబాద్ గురువారం రాత్రి 08:30 కు ఎల్. బి నగర్ లో స్థానికంగా ఉన్న జైపాల్ ను కలిసేందుకు వెళుతుండగా చంద్రాయన్ గుట్ట బ్రిడ్జి వద్ద పట్టుకున్నట్లు తెలిపారు పోలీసులు. నిందితుడు జాదవ్ శివరాం పై గతంలో 2020లో శంషాబాద్ ఎక్సయిజ్ పోలీస్ స్టేషన్, 2021లో సంగారెడ్డిలోని నగలిగిడ్డలో కేసులు ఉన్నట్లు తెలిపారు పోలీసులు.