
- రూ.2.5 కోట్ల విలువైన 26 కార్లు స్వాధీనం
జీడిమెట్ల, వెలుగు : కార్లను రెంట్‌కు తిప్పుతామంటూ తీసుకొని వాటిని అమ్మేసిన ముఠాను హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను బాలానగర్ డీసీపీ సురేశ్‌కుమార్, ఏసీపీ హనుమంతరావు, జగద్గిరిగుట్ట సీఐ నర్సింహ గురువారం వెల్లడించారు. ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన అప్పరి విశ్వ ఫణీంద్ర ఇంటర్ మధ్యలోనే ఆపేరి ఖతార్ వెళ్లి కారు డ్రైవర్‌గా పనిచేశాడు. ఇండియాకు వచ్చిన అనంతరం ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి గాజులరామారం దేవేందర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు.
ఈజీ మనీ కోసం ప్లాన్ చేసిన విశ్వ ఫణీంద్ర స్థానికంగా ఉంటున్న చివకల రమణ అలియాస్ బొంతల వెంకటరమణ, జక్కంశెట్టి సత్యనారాయణ, రెడ్డి వెంకటేశ్‌తో కలిసి వీవీవీ టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో ఆఫీస్‌ను ఓపెన్ చేశారు. కార్లను రెంట్‌కు తిప్పుతామంటూ పలువురి వద్ద లీజ్‌కు తీసుకున్నారు. రెండు, మూడు నెలలు రెంట్స్ చెల్లించి తర్వాత తప్పించుకు తిరుగుతున్నారు. చివరకు ఆఫీస్ మూసేసి పారిపోయారు. దీంతో శశిధర్ అనే వ్యక్తి జనవరి 27న జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా లీజు పేరుతో తీసుకున్న 26 కార్లను అమ్మేసినట్లు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వ ఫణీంద్రను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించగా మిగతా వారు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. విశ్వఫణీంద్రపై ఖమ్మం జిల్లాలో కూడా రెండు కేసులు నమోదైనట్లు చెప్పారు.