అంబులెన్స్​లో కుక్కను తీసుకు వెళ్తూ సైరన్ ..సీజ్​ చేసిన సిటీ ట్రాఫిక్​ పోలీసులు 

అంబులెన్స్​లో కుక్కను తీసుకు వెళ్తూ సైరన్ ..సీజ్​ చేసిన సిటీ ట్రాఫిక్​ పోలీసులు 

హైదరాబాద్, వెలుగు:  పంజాగుట్ట పోలీసు స్టేషన్​ పరిధిలో ఓ అంబులెన్స్​లో కుక్కను తరలిస్తూ.. సైరన్​ వేసుకుంటూ వెళ్తున్న వ్యక్తిని  పోలీసులు పట్టుకున్నారు. హిమాయత్​నగర్​ నుంచి మదీనా గూడ వైపు సైరన్​తో ఓ అంబులెన్స్​ వెళ్తుండగా..   పంజాగుట్ట వద్ద పోలీసులు  తనిఖీ చేశారు.  అంబులెన్స్​ డోర్​ తెరచి చూస్తే అందులో కుక్క మాత్రమే ఉంది. దీంతో పోలీసులు షాక్​ గురయ్యారు. ప్రాణాపాయ స్థితిలో  రోగులుంటేనే  సైరన్​ వేసి తీసుకు వెళ్లాలని  డ్రైవర్​ను హెచ్చరించారు.

కుక్కను మియాపూర్​లో వేసెక్టమీ ఆపరేషన్​ చేయించేందుకు తీసుకు వెళ్తున్నట్టు  డ్రైవర్ చెప్పాడు. దీంతో  అంబులెన్స్​ ఓనర్​ అబ్దుల్​ కలీమ్​ పై పోలీసులు కేసునమోదు చేశారు. పోలీసు కమిషనర్​ ఆదేశాల ప్రకారం అంబులెన్స్​ల పనితీరు పై ప్రత్యేక డ్రైవ్​ నిర్వహిస్తున్నామని ట్రాఫిక్​ ఏసీపీ హరిప్రసాద్​ తెలిపారు. ఇందులో భాగంగా సదరు అంబులెన్స్​ను తనిఖీ చేసినట్టు తెలిపారు. అంబులెన్స్​కు ఉండే ట్రాఫిక్​ మినహాయింపులను దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.