- హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర పట్టివేత
- రాజమండ్రికి తరలిస్తున్నట్లు చెప్పిన నిందితులు
- బుధవారం రూ.4 కోట్లు స్వాధీనం
- ఇప్పటివరకు 20 కోట్లు పట్టివేత
హైదరాబాద్, వెలుగు: ఏపీ టీడీపీ ఎంపీ మురళీమోహన్ కు చెందిన రూ.2 కోట్ల నగదును సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు పట్టుకున్నారు. బుధవారం హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర నిందితులు నిమ్మలూరి శ్రీహరి (44), ఆరుతి పండరి (39) ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో రూ.2 కోట్ల నగదును సీజ్ చేశారు. జయభేరి ప్రాపర్టీస్ లో పని చేస్తున్నామని, రాజమండ్రికి డబ్బులు తరలిస్తున్న నిందితులు అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. దీంతో పాటు హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనూ నగదు పట్టు బడింది.
బుధవారం ఒక్కరోజే వేర్వేరు చోట్ల రూ.4 కోట్ల నగదు పట్టు బడినట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హయత్ నగర్ నుంచి చౌటుప్పల్ వెళ్తున్న కారులో రూ.48 లక్షలను రాచకొండ ఎస్ వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అదే పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం చౌరస్తాలో కారులో తరలిస్తున్న4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.41 లక్షల నగదును స్వాధీనం చేసుకొని , 8 మందిని అరెస్టు చేశారు.
గోషామహల్ రోడ్ దగ్గర రూ.26 లక్షలు,రాం గోపాల్ పేట్ వద్ద రూ.15 లక్షలు పట్టు కున్నట్లు పోలీసులు చెప్పారు. గోదావరిఖనిలోని గోదావరి నది బ్రిడ్జి చెక్ పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సులో రూ.32 లక్షలు పట్టుకున్నట్టు తెలిపారు. ఆసిఫాభాద్ లో వ్యాపారి నుంచి రూ.29.02 లక్షలు, మంచిర్యాలకు చెందిన రవీందర్ నుంచి రూ.98 వేలు, వెన్నంపల్లి తిరుపతి అనే వ్యక్తి కారులో రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో పోస్టల్ డిపార్ట్మెంట్ కారులో రూ.15 లక్షలు పట్టుబడింది. నల్గొండ జిల్లా మాడుగులపల్లి టోల్ గేట్ వద్ద ఆర్టీసీ బస్సులో రూ.30 లక్షలు పట్టు బడ్డాయి.అదే జిల్లాకు చెందిన దేవరకొండలో ముగ్గురి నుంచి రూ. 3 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.20.33 కోట్లను సీజ్ చేశారు. రూ.73,65,182 విలువైన 22,585 లీటర్ల మద్యం ,రూ.2.8 కోట్ల మాదక ద్రవ్యాలు, గంజాయి స్వాధీనం చేసుకున్నారు.