హైదరాబాద్, వెలుగు: పోలీస్ కాక ముందు తాను బెస్ట్ స్పోర్ట్స్ మెన్‌ని అని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. క్రికెట్లో బ్యాటింగ్ కు దిగితే సెంచరీ కొట్టాల్సిందేనన్నారు. వంద మీటర్ల రన్నింగ్ రేస్‌లో గోల్డ్ మెడల్ కొట్టాలనే పట్టుదలతో బరిలోకి దిగుతానన్నారు. ఆటల్లో ఓడిపోతే ఆ రాత్రి నిద్ర పట్టదని తెలిపారు. గోషామహల్ పోలీస్ స్టేడియంలో సోమవారం ‘పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2025’ మొదలైంది. బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, పి.కష్యప్‌తో కలిసి సీపీ ఆనంద్ జెండా ఊపి ప్రారంభించారు.
సీపీ మాట్లాడుతూ.. నాలుగు రోజుల పాటు సాగే యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొంటున్నారని, మొత్తం 24 రకాల ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా.. స్పోర్ట్స్ మీట్‌లో 14 జట్లు పాల్గొనడం ఇదే మొదటిసారి అన్నారు. సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. ఫిట్నెస్కోసం పోలీసులు రెగ్యులర్‌గా స్పోర్ట్స్ లో పాల్గొనాలని సూచించారు. దేశం తరఫున ఆడినప్పుడు ఎంతో గర్వంగా
ఉంటుందన్నారు.
స్పోర్ట్స్ మీట్‌తో నూతన ఉత్సాహం
ఎల్బీనగర్: సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సోమవారం రాచకొండ పోలీస్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. సీపీ సుధీర్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. నిర్వహణలోని ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొంది, నూతన ఉత్సాహంతో పనిచేసేందుకు స్పోర్ట్స్ మీట్ ఉపయోగపడుతుందని సీపీ చెప్పారు. డీసీపీలు రాజేశ్చంద్ర, ప్రవీణ్ కుమార్, పద్మజ, అరవింద్ బాబు, సునీతారెడ్డి, రమణారెడ్డి, మురళీధర్, శ్రీనివాస్, ఇందిర, నాగలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.