హైదరాబాదీలకు అలర్ట్: పిల్లలకు కార్ ఇస్తున్నారా... జైలు తప్పదు..

హైదరాబాదీలకు అలర్ట్: పిల్లలకు కార్ ఇస్తున్నారా... జైలు తప్పదు..

ఈరోజుల్లో కార్ డ్రైవింగ్ రానోళ్లను వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. స్కూల్ పిల్లలు మొదలుకొని.. సీనియర్ సిటిజన్స్ వరకు అలవోకగా కార్లు డ్రైవ్ చేసేస్తున్నారు. ఇక సిటీల్లో సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు... చిన్నపిల్లలు కూడా యథేచ్ఛగా కార్లేసుకొని రోడ్డెక్కుతున్నారు. ఏటా జరిగే యాక్సిడెంట్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులతో పాటు మైనర్ డ్రైవింగ్ కేసులు కూడా కారణమవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం ( ఏప్రిల్ 5 ) నుంచి మైనర్ల డ్రైవింగ్ అంశంలో స్ట్రిక్ట్ రూల్స్ అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు పోలీసులు.

మైనర్లు కారు నడుపుతూ పట్టుబడితే.. వెహికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని.. ఈ మేరకు శనివారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు పోలీసులు. మోటార్ వెహికల్ యాక్ట్1988 ప్రకారం మైనర్లు మోటార్ వాహనాలు నడపడం నిషేధమని.. ఒకవేళ  మోటార్ వాహనాలు నడుపుతూ మైనర్లు పట్టుబడితే, పేరెంట్స్, గార్డియన్స్ వెహికల్ ఓనర్ కూడా చట్టబద్ధంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని.. కఠినమైన శిక్షలను ఎదుర్కొంటారని తెలిపారు పోలీసులు.

మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 199A ప్రకారం, మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడితే, వెహికల్ రిజిస్ట్రేషన్ 12 నెలల పాటు రద్దు చేయబడుతుందని.. తల్లిదండ్రులు లేదా వాహన యజమానికి జరిమానా లేదా జైలు శిక్ష విధించబడుతుందని.. మైనర్ 25 సంవత్సరాల వయస్సు వరకు లెర్నర్స్, డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అర్హత కోల్పోతారని తెలిపారు. 

తల్లిదండ్రులు బాధ్యత వహించి తమ పిల్లలు వాహనాలు నడపకుండా జాగ్రత్త వహించాలని.. ఈ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు.